Donald Trump: నాటో ఒక ‘కాగితపు పులి’.. మిత్రదేశాలపై నిప్పులు చెరిగిన డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు రక్షణ కవచంగా ఉన్న నాటో (NATO) కూటమి నుంచి అమెరికా వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన బాంబు పేల్చారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ (The Telegraph) కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నాటో మిత్రదేశాల తీరుపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నాటో ఒక కాగితపు పులి..
నాటో కూటమిని ఒక ‘కాగితపు పులి’గా (Paper Tiger) అభివర్ణించిన ట్రంప్ (Donald Trump).. ఆ కూటమి మాటలకు తానెప్పుడూ ప్రభావితం కాలేదన్నారు. నాటో డొల్లతనం రష్యాకు కూడా స్పష్టంగా తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ ఆగ్రహానికి అసలు కారణం ఏమిటి?
పశ్చిమాసియాలో ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న పోరులో నాటో మిత్రదేశాలు వ్యవహరిస్తున్న తీరు ట్రంప్ (Donald Trump) ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. “రష్యాతో నాలుగేళ్లుగా ఉక్రెయిన్ చేస్తున్న భీకర యుద్ధంలో.. వాళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా అమెరికా అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు ఇరాన్ విషయంలో, ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిపించేందుకు మాకు తోడుగా రావాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా నాటో మిత్రదేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇది నేను అస్సలు ఊహించలేదు” అని ట్రంప్ (Donald Trump) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పిలుపును పట్టించుకోని నాటో దేశాలను ఆయన ‘పిరికివాళ్లు’ అంటూ ఇటీవల ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.
గతంలోనూ ఇదే తరహా హెచ్చరికలు
అయితే, ట్రంప్ (Donald Trump) ఇలా నాటో నుంచి బయటకు వచ్చేస్తామని బెదిరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన తొలి విడత అధ్యక్ష పదవీ కాలంలో (2018లో) కూడా ఆయన సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రతి సభ్య దేశం తమ దేశ జీడీపీలో (GDP) కనీసం రెండు శాతం నిధులను రక్షణ బడ్జెట్‌పై వెచ్చించాలన్న నిబంధనను ఉల్లంఘిస్తే, కూటమి నుంచి నిర్మొహమాటంగా వైదొలుగుతామని అప్పట్లో తేల్చిచెప్పారు. తాజా పరిణామాలతో నాటో కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








