Iran: యుద్ధం ముగింపునకు సై.. కండీషన్స్ ఇవే: ఇరాన్
Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరాన్ కీలక సంకేతాలు ఇచ్చింది. ఇజ్రాయెల్ , అమెరికాతో కొనసాగుతున్న పోరాటాన్ని ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. అయితే, దీనికి సంబంధించి తమకు కొన్ని గట్టి భరోసాలు కావాలని ఆయన స్పష్టం చేశారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో చర్చలు:
యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో జరిగిన ఫోన్ సంభాషణలో పెజెష్కియాన్ ఈ అంశాలను ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇరాన్‌పై మళ్ళీ ఇలాంటి దాడులు జరగవని, ఇతర దేశాల నుంచి తమకు భద్రతా పరమైన హామీలు లభిస్తే యుద్ధాన్ని విరమించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ చర్చ అనంతరం ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గాలంటే గల్ఫ్ దేశాలపై దాడులను ఆపాలని, దౌత్య పరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన ఇరాన్‌ను కోరారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి గుండా రవాణా పునరుద్ధరణపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాతో చర్చలపై స్పష్టత:
మరోవైపు, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ నుంచి తమకు సంకేతాలు అందుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ధృవీకరించారు. అయితే, ఇది అమెరికాతో అధికారికంగా చర్చలు జరపడం కాదని ఆయన స్పష్టం చేశారు.
తమకు మధ్యవర్తుల ద్వారా కూడా కొన్ని ప్రతిపాదనలు అందాయని, కానీ వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా, యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలన్నదే ఇరాన్ ఉద్దేశమని అరాగ్చీ పేర్కొన్నారు.
అమెరికాలో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్ది వారాల్లోనే ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.








