ట్రంప్ విధానాలతో భారత్, చైనా నష్టపోయాయి : వాషింగ్టన్ పోస్ట్ సంచలన విమర్శలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెద్దు పోకడలపై వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రంప్ కఠినమైన వలస విధానాల కారణంగా భారత్, చైనా దేశాలు దారుణంగా నష్టపోతున్నాయని పేర్కొంది. 2024 తొలి ఎనిమిది నెలలతో పోల్చుకుంటే 2025 లో అదే సమయంలో 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మార్చి ప్రారంభంలో అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 జనవరి ఆగస్టుతో పోలిస్తే 2025 అదే సమయంలో 11 శాతం తక్కువగా శాశ్వత, తాత్కాలిక వీసాలను ట్రంప్ సర్కార్ ఆమోదించింది. ఆ వీసాలను విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చేవారు, చట్టబద్ధ నివాసితుల కుటుంబీకులకు జారీ చేస్తుంటారు. తగ్గిన ఆ 11 శాతం వీసాల్లో పర్యాటక వీసాలు భాగమే కాదు అని వైట్ హౌజ్ పేర్కొంది. అలాగే అమెరికా పౌరులకే తొలి ప్రాధాన్యం అన్న హామీని ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చారని, ప్రతి నిర్ణయం దీనినే ప్రతిబింబిస్తోందని కూడా వైట్ హౌజ్ పేర్కొంది. సొంత ప్రజల భద్రత విషయంలో ట్రంప్ రాజీలేని వైఖరితో వున్నారని కూడా తెలిపింది.








