విజయ్ మాల్యా కథ ఆధారంగా వెబ్ సిరీస్
ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా(Vijay Mallya) లైఫ్ జర్నీ ఇన్సిపిరేషన్ గా ఓ కొత్త వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. బిలియనీర్ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్(Arjun rampal) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇది విజయ్ మాల్యా జీవితానికి సంబంధించిన అఫీషియల్ బయోపిక్ కాదని, ఆయన జర్నీలోని కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు హన్సల్ మెహతా(Hansal mehta), రాబీ గ్రేవాల్(Robby Graval) దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.
కథలో అర్జున్ రాంపాల్ ఓ సంపన్న వ్యాపారవేత్తగా కనిపించనున్నారు. చిన్న స్థాయి నుంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ అపారమైన సంపద, పలుకుబడి, అధికారాన్ని సంపాదించుకునే వ్యక్తిగా ఆయన పాత్ర సాగుతుంది. అయితే సక్సెస్ తో పాటు వచ్చే ఆశలు, నిర్ణయాలు, సంబంధాలపై వాటి ప్రభావం, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే మూల్యం వంటి అంశాలను కూడా సిరీస్ ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం ఓ బిజినెస్ డ్రామాగా కాకుండా అధికారం, ఆశయం, పతనం చుట్టూ తిరిగే కథగా ఉండనుంది.
విజయ్ మాల్యాతో ఉన్న పోలికల కారణంగా ఈ సిరీస్‌పై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. యూబీ గ్రూప్ ద్వారా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కారణంగా ఎదురైన ఆర్థిక సంక్షోభంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. విమానయాన సంస్థకు సంబంధించిన రుణ బకాయిలు అనంతరం పెద్ద ఆర్థిక, న్యాయ వివాదానికి దారితీశాయి. 2016లో ఆయన భారత్‌ను విడిచి బ్రిటన్‌కు వెళ్లారు. అయితే తాను దేశం నుంచి పారిపోలేదని, అంతర్జాతీయ వ్యాపారవేత్తగా విదేశాలకు వెళ్లానని మాల్యా అప్పట్లో పేర్కొన్నారు. ఆయనపై ఉన్న ఆర్థిక నేరాల ఆరోపణలకు సంబంధించి భారత అధికారులు బ్రిటన్ నుంచి అప్పగింత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.








