మళ్లీ వాయిదా దిశగా నాని ‘ది ప్యారడైజ్’
నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్(The Paradise) రిలీజ్ డేట్ పై మరోసారి అనిశ్చితి నెలకొన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దసరా సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడటంతో సినిమా ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. అయితే షూటింగ్ పనులు అనుకున్న వేగంతో సాగకపోవడంతో రిలీజ్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట అనౌన్స్ చేసిన డేట్ నుంచి వాయిదా పడిన ఈ సినిమా ప్రస్తుతం ఆగస్ట్ 21 విడుదలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆ సమయానికి కూడా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేననే ప్రచారం టాలీవుడ్లో వినిపిస్తోంది.
ఇదే సమయంలో ఆ తేదీని మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజ(ravi teja) హీరోగా శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి(Irumudi) సినిమాను ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్‌కు లభించిన మంచి స్పందనతో ఉత్సాహంగా ఉన్న మేకర్స్, విడుదల తేదీని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఆ రోజున బాక్సాఫీస్ వద్ద ఇరుముడి సందడి చేయడం ఖాయమైంది.
మరోవైపు ది ప్యారడైజ్ ఆలస్యానికి ప్రధాన కారణం డైరెక్టర్ విజన్నేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించాలనే ఉద్దేశంతో షూటింగ్ కు అదనపు సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా పెరుగుతున్నప్పటికీ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారట. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర పరిణామాలు మరింత చర్చనీయాంశం కానున్నాయి.








