కత్రినా రీఎంట్రీకి ఇదేనా సరైన సినిమా?
చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kaif).. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. విక్కీ కౌశల్(Vicky Kaushal)ను పెళ్లి చేసుకున్న తర్వాత పర్సనల్ లైఫ్ కు ప్రాధాన్యత ఇచ్చిన ఆమె.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా కాజోల్(kajol) ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ సినిమా మా(MAA) సీక్వెల్‌తో కత్రినా కమ్‌బ్యాక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్లో ఆసక్తి పెరిగింది.
అయితే కత్రినా లాంటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీకి మా సినిమా సీక్వెల్ సరైన ఎంపికేనా? అనే డిస్కషన్ కూడా మొదలైంది. 2025లో రిలీజైన మా మూవీకు సైతాన్(shaithan) తో ఉన్న కథా సంబంధం, హారర్ కాన్సెప్ట్ కారణంగా ప్రారంభంలో మంచి హైప్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా కథనం బలహీనంగా ఉండటంతో పాటు సినిమాలోని వీఎఫ్ఎక్స్పై తీవ్ర విమర్శలొచ్చాయి. హారర్ అనుభూతిని పెంచాల్సిన విజువల్ ఎఫెక్ట్స్నే ప్రేక్షకులు అసంతృప్తికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
మరోవైపు స్త్రీ(Stree), ముంజ్యా(munjya) వంటి హారర్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ జానర్‌పై బాలీవుడ్లో నమ్మకం ఉంది. కానీ మా ఫ్రాంచైజీ విషయంలో ఆ స్థాయి రిజల్ట్ ఇప్పటివరకు కనిపించలేదు. షారుఖ్ ఖాన్(shah rukh khan), సల్మాన్ ఖాన్(salman khan) వంటి అగ్ర హీరోలతో భారీ సినిమాల్లో నటించిన కత్రినా.. తన కమ్‌బ్యాక్ కోసం ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కథ, మేకింగ్, వీఎఫ్ఎక్స్లో సీక్వెల్ మెరుగ్గా ఉంటే మాత్రం కత్రినాకు ఈ సినిమా మంచి రీఎంట్రీగా నిలిచే అవకాశం ఉంది.








