పేటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఫిన్‌టెక్ దిగ్గజం!
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పై ఇటీవల జరిగిన నియంత్రణ చర్యల నేపథ్యంలో, పేటీఎం తన సేవలపై కీలక స్పష్టతనిచ్చింది. ఈ చర్యల వల్ల పేటీఎం యాప్ లేదా ఇతర వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది.
ఆటంకం లేకుండా..
పేటీఎం అందిస్తున్న ప్రధాన సేవలైన పేటీఎం యాప్, పేటీఎం యూపీఐ (UPI), పేటీఎం గోల్డ్ వంటివి ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి. వీటితో పాటు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడే పేటీఎం క్యూఆర్ కోడ్ (QR), సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్లు , పేమెంట్ గేట్‌వే సేవలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది.
ఆర్థిక లావాదేవీలు లేవని..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో తమకు ప్రస్తుతం ఎటువంటి ప్రత్యక్ష వ్యాపార ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీలు లేవని ఈ ఫిన్‌టెక్ దిగ్గజం తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. PPBL ఒక స్వతంత్ర సంస్థగా పనిచేస్తుందని, దాని నిర్వహణలో తమకు ప్రమేయం లేదని పేటీఎం వివరించింది.
భవిష్యత్తులో నిరంతరాయంగా..
నిజానికి, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో తమకున్న పెట్టుబడిని మార్చి 31, 2024 నాటికే రద్దు (Write-off) చేసుకున్నట్లు సంస్థ గుర్తుచేసింది. దీనివల్ల తమకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లదని అప్పుడే స్పష్టం చేసినట్లు తెలిపింది. పేటీఎం మనీ, పేటీఎం ట్రావెల్ వంటి అనుబంధ సంస్థల సేవలు కూడా భవిష్యత్తులో నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి








