Petrol: తెలంగాణాలో పెట్రోల్ కొరతపై కీలక ప్రకటన..!
గల్ఫ్ లో జరుగుతోన్న యుద్ధం కారణంగా భారత్ లో చమురు సంక్షోభంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంధన కొరత లేదు అని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ స్పందించింది. రాష్ట్రంలో ఇంధన కొరత ఏమీ లేదని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా హెచ్పీసీఎల్ (HPCL), ఐవోసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీనివల్ల సాధారణం కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా విక్రయాలు జరుగుతున్నాయని అసోసియేషన్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
అవసరం లేకున్నా ముందస్తుగా, భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల బంకుల వద్ద అనవసర రద్దీ ఏర్పడి, ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు వివరించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ఆందోళనతో అధిక మోతాదులో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కోరింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను గుడ్డిగా నమ్మకండని సూచించింది. బంకుల వద్ద రద్దీ తగ్గించి సహకరించాలని విజ్ఞప్తి. చేసింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సరఫరా సాధారణంగానే ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ మరోసారి భరోసా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి








