Excise Duty: చమురు కంపెనీలకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు!
పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముడి చమురు ధరలు (Crude oil prices) భారీగా పెరుగుతుండటంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి ఆయిల్ కంపెనీలను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక, వ్యూహాత్మక నిర్ణయం (Excise Duty) తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ‘ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ‘ని (Special Additional Excise Duty – SAED) లీటర్‌కు రూ.10 చొప్పున భారీగా తగ్గించింది. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై ఇప్పటివరకు ఉన్న రూ.13 అదనపు డ్యూటీ కేవలం రూ.3కి పడిపోయింది. డీజిల్‌పై ఉన్న రూ.10 డ్యూటీ పూర్తిగా రద్దయింది.
వినియోగదారులకు శూన్యం
కేంద్రం ఇంత భారీగా పన్నులు (Excise Duty) తగ్గించినప్పటికీ.. సామాన్య వినియోగదారులకు (Consumers) పెట్రోల్ బంకుల్లో లభించే ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న పాత ధరలే కొనసాగుతాయి. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల వల్ల కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ తగ్గింపు ప్రయోజనాన్ని కేంద్రం నేరుగా ఆయిల్ కంపెనీలకు బదిలీ చేసింది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ నిర్ణయాన్ని వివరిస్తూ.. “ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.24, డీజిల్‌పై రూ.30 వరకు నష్టపోతున్నాయి. ఆ నష్ట భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని త్యాగం చేస్తోంది” అని స్పష్టం చేశారు. ఈ డ్యూటీ (Excise Duty) తగ్గింపు వల్ల రాబోయే 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7,000 కోట్ల ఆదాయం గండిపడనుంది.
ఇవి కూడా చదవండి
ఎగుమతులపై కొరడా..
ఒకవైపు దేశీయంగా ఆయిల్ కంపెనీలకు పన్నుల (Excise Duty) భారం తగ్గించిన కేంద్రం, అదే సమయంలో దేశం నుంచి బయటకు వెళ్లే ఇంధన ఎగుమతులపై (Exports) ఉక్కుపాదం మోపింది. దేశీయ అవసరాలకు ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతులను నియంత్రించే ఉద్దేశంతో ‘విండ్‌ఫాల్ ట్యాక్స్’ (Windfall Tax) విధించింది. డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.21.5. విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై లీటర్‌కు రూ.29.5 ప్రత్యేక పన్నును వడ్డించింది.
ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్ (Excise Duty) విధింపు ద్వారా వచ్చే 15 రోజుల్లో కేంద్రానికి సుమారు రూ.1,500 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని సీబీఐసీ చైర్మన్ వివేక్ చతుర్వేది వెల్లడించారు. గ్లోబల్ ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకోసారి ఈ పన్నును సమీక్షిస్తామని ఆయన తెలిపారు.
ఎల్పీజీ కోటా పెంపు
ఇదే క్రమంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు కేటాయించే కమర్షియల్ ఎల్పీజీ (Commercial LPG) కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అధిక ఉపాధి కల్పించే ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, కెమికల్స్, ప్లాస్టిక్ వంటి భారీ కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఇంధన లభ్యతలో ఎలాంటి లోటు రాకుండా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు (CS) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి








