2026 ఇన్నోవా క్రిస్టా లాంచ్.. కానీ ఆ ఒక్క షాకింగ్ వార్తతో ఫ్యాన్స్ సైలెంట్!
భారతీయ రహదారులపై లాంగ్ డ్రైవ్‌లు, లగ్జరీ ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఏకైక వాహనం ‘టయోటా ఇన్నోవా‘ (Innova Crysta). భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎన్ని సరికొత్త మోడళ్లు వచ్చినా, ఇన్నోవాకు ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఈ తిరుగులేని ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్, తాజాగా సరికొత్త హంగులతో ‘ఇన్నోవా క్రిస్టా 2026’ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా ఈ కొత్త మోడల్ (Innova Crysta) ప్రారంభ ధరను రూ. 19.72 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, అన్ని అధునాతన ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ ‘జెడ్ఎక్స్’ (ZX) వేరియంట్ ధర రూ. 26.63 లక్షల వరకు ఉంది.
ఇదే చివరి మోడల్ కానుందా?
ఈ కారు లాంచ్‌తో ఇన్నోవా లవర్స్ పండుగ చేసుకుంటున్న తరుణంలో.. ఆటోమొబైల్ రంగం నుంచి ఒక అనూహ్యమైన వార్త బయటకు వచ్చింది. టయోటా కంపెనీ అంతర్గత వ్యూహాల ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2027 నాటికి ఈ ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) మోడల్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు గట్టిగా వినపడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన 2026 క్రిస్టా ఎడిషనే ఈ సిరీస్‌లో ఆఖరి, అత్యంత ప్రత్యేకమైన మోడల్‌గా నిలిచిపోనుంది. ఈ ఒక్క కారణం చేతనే ఈ కారును సొంతం చేసుకోవడానికి లగ్జరీ కార్ల ప్రియులు ఇప్పటి నుంచే షోరూమ్‌ల వైపు పరుగులు తీస్తున్నారు.
విలాసవంతమైన ఇంటీరియర్!
కొత్త ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) వెలుపలి డిజైన్‌ను మునుపటి కంటే చాలా లగ్జరీగా, బోల్డ్‌గా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కారు ముందు భాగంలో మూడు క్రోమ్ లైన్లతో డిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బాడీపై అక్కడక్కడా ఇచ్చిన క్రోమ్ టచ్‌లు కారుకు మునుపెన్నడూ లేని గ్రాండ్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఇక క్యాబిన్ లోపలికి అడుగుపెడితే.. విలాసవంతమైన డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు ప్రయాణికులకు గొప్ప సౌకర్యాన్ని ఇస్తాయి. రిఫ్రెష్ చేసిన డాష్‌బోర్డ్, రాయల్ లుక్ ఇచ్చే వుడ్-ఫినిష్ డిజైన్, మరింత సులభంగా మార్చుకునేలా అప్డేట్ చేసిన ఏసీ కంట్రోల్స్ కారు లోపల ప్రీమియం ఫీల్‌ను కలిగిస్తాయి. ఆధునిక కాలపు అవసరాలకు తగ్గట్టుగా వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ల గాలి ఒత్తిడిని పర్యవేక్షించే టీపీఎంఎస్ (TPMS) వంటి అత్యాధునిక ఫీచర్లను కూడా ఇందులో జోడించారు.
పవర్ఫుల్ ఇంజిన్.. కొండంత భద్రత!
ఇన్ని మార్పులు చేసినా టయోటా సంస్థ ఇన్నోవాకు (Innova Crysta) అసలైన బలమైన ఇంజిన్‌ను మాత్రం మార్చలేదు. నమ్మకమైన, పవర్ఫుల్ 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్, స్మూత్ మాన్యువల్ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తోనే ఈ కారు రోడ్లపై దూసుకెళ్లడానికి సిద్ధమైంది. భద్రత విషయంలోనూ టయోటా ఎక్కడా రాజీ పడలేదు. ప్రయాణికుల రక్షణ కోసం ఏకంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు (7 Airbags), ఏబీఎస్-ఈబీడీ (ABS with EBD), వాహనం రోడ్డుపై బ్యాలెన్స్ తప్పకుండా చూసే వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి టాప్-క్లాస్ సేఫ్టీ ఫీచర్లను ఇందులో స్టాండర్డ్‌గా అందించారు. లగ్జరీ, పవర్, సేఫ్టీల కలయికగా వచ్చిన ఈ 2026 మోడల్.. క్రిస్టా సిరీస్‌కు ఒక గ్రాండ్ ముగింపు ఇవ్వబోతోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.








