కేటీఆర్‌కు పాదయాత్ర ‘సెంటిమెంట్’ కలిసొచ్చేనా?
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. ఏ పార్టీ నేత అయితే జనం మధ్యకు వెళ్లి సుదీర్ఘ పాదయాత్ర చేస్తారో, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి పదేళ్ల టీడీపీ పాలనకు చెక్ పెట్టేందుకు ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టారు. 2004లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో చంద్రబాబు, 2018లో వైఎస్ జగన్ ఇదే వ్యూహంతో సక్సెస్ అయ్యారు. ఇక 2023లో టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో చేసిన పాదయాత్ర ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగా, తెలంగాణలో 2022లో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చింది. ఇప్పుడు ఇదే గెలుపు సెంటిమెంట్‌ను నమ్ముకుని, సక్సెస్ సాధించాలనుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇటీవల కేటీఆర్ చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2027లో తాను రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈలోపు ఫిట్ నెస్ సాధిస్తానని ఆయన అన్నారు. దీంతో పాదయాత్ర కోసం సీరియస్ గానే ప్రిపేర్ అవుతున్నట్టు అర్థమవుతోంది. పార్టీ అంతర్గత చర్చల అనంతరం పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేస్తామని కూడా కేటీఆర్ తెలిపారు.
కేటీఆర్ ప్రకటనను ఒక సాధారణ రాజకీయ ప్రకటనగా చూడలేం. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో పాలనాపరమైన ఒత్తిళ్లు, అధికార దూరం కారణంగా బీఆర్ఎస్ పార్టీకి, క్షేత్రస్థాయి ప్రజలకు మధ్య కొంత దూరం పెరిగిందనే వాస్తవాన్ని గులాబీ శ్రేణులు గుర్తించాయి. ఇప్పుడు ఆ అంతరాన్ని పూర్తిగా చెరిపేసేందుకు, గ్రామీణ స్థాయితో సంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకునేందుకు ఈ యాత్రను ఒక బ్రహ్మాస్త్రంగా కేటీఆర్ భావిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ అంటే హై టెక్, అర్బన్, గ్లోబల్ లీడర్ అనే ముద్ర ఉంది. అయితే, వైఎస్సార్, చంద్రబాబు, రాహుల్ గాంధీ వంటి దిగ్గజాల బాటలో నడవడం ద్వారా ఆ ఇమేజ్ను పూర్తిస్థాయి ప్రజా నాయకుడిగా మార్చుకోవాలన్నది కేటీఆర్ ప్రధాన తపనగా కనిపిస్తోంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న అసంతృప్తి బీఆర్ఎస్కు రాజకీయంగా కలిసివచ్చే అంశమే అయినప్పటికీ, గత ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం కొంత మేర తగ్గింది. అందుకే, ఈ పాదయాత్ర ద్వారా నిరాశలో ఉన్న పార్టీ కేడర్‌ను పునరుజ్జీవింపజేయడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యం. అలాగే క్షేత్రస్థాయిలో కొత్త, సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించాలి. ప్రజల కష్టనష్టాలను, స్థానిక సమస్యలను నేరుగా అర్ధం చేసుకోవడం బీఆర్ఎస్కు అత్యంత కీలకం కానుంది.
కేటీఆర్ పాదయాత్ర విజయవంతమైతే, అది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ నంబర్ వన్ ప్రత్యామ్నాయంగా నిలబెడుతుంది. అయితే, పాదయాత్ర అంటే కేవలం నడక మాత్రమే కాదు. దాని వెనుక పక్కా అజెండా, ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉండాలి. లేదంటే అది ఎన్నికల ముందు చేసే ఒక పొలిటికల్ డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా 2027లో కేటీఆర్ అడుగుపెట్టబోతున్న ఈ మహాయాత్ర, తెలంగాణ ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? గులాబీ పార్టీకి పూర్వవైభవం తెస్తుందా? లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.








