TRS: కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పంథాను ఎంచుకుంటూ నూతన పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) గా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు భారీ సంఖ్యలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మద్దతుదారులు తరలివచ్చారు.
సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కవిత, తన ప్రసంగం పొడవునా పాత జ్ఞాపకాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడామని, జాగృతి కార్యకర్తలు రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడారని ఆమె కొనియాడారు. అయితే, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో, అవి నేడు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా గత ప్రభుత్వ తీరుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగమే. అందుకే కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నాను. తెలంగాణ ప్రజలను క్షమించమని కోరుతున్నాను” అని ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తెలంగాణ సాధించినందుకు గర్వంగా ఉన్నప్పటికీ, పాలనలో జరిగిన తప్పుల్లో తనకు భాగం ఉన్నందుకు కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, అందుకే సామాజిక తెలంగాణ కోసం మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు.
తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు. నాడు చేనేత కార్మికులు చనిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్, నేడు మారిన మనిషి.. ఒక మర మనిషి. ఆయన మన మనిషి కాదు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చుట్టూ కొందరు గుంటనక్కలు, తోడేళ్లు చేరాయని, ఆయన వారి చేతిలో ఖైదీ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తన ఆత్మను కోల్పోయిందని, జాతీయ రాజకీయాల పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. కేంద్రంతో అనవసర గొడవల వల్ల పాలమూరు వంటి కీలక ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన కూడా కవిత తీవ్ర విమర్శలు సంధించారు. తెలంగాణలో ఫోన్లు ఎక్కడ వింటున్నారో అనే భయం వెంటాడుతోందని, రాష్ట్రమంతా నిఘా నీడలో బతుకుతోందని మండిపడ్డారు. రైతులకు బేడీలు పడ్డాయని, ఇసుక దందాల వల్ల దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. సామాజిక తెలంగాణ రథ చక్రాలు విరిగి ముక్కలయ్యాయని, రాజకీయ అధికారం తోడైతేనే ప్రజలకు సంపూర్ణ న్యాయం చేయగలమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఒక కర్కోటకుడి పాలనలో నడుస్తోందన్నారు. అందుకే అతడ్ని హిట్లర్ అంటున్నానని పరోక్షంగా రేవంత్ రెడ్డిని కవిత విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. ‘తల్లిని చంపి పిల్లను బతికించారు’ అని కొందరు, ‘భారత్-పాక్ విభజనలా తెలంగాణను విడదీశారు’ అని మరికొందరు ఎంపీలు అంటున్నా, రాష్ట్రంలోని బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అలాగే, తాను అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు జవాబు చెప్పడం లేదని, వారు చెప్పకపోతే ప్రజలే వారిని నిలదీస్తారని హెచ్చరించారు.
తెలంగాణలోని 3.5 కోట్ల మంది ప్రజలకు ఒక ‘అమ్మ’లా సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు కవిత ప్రకటించారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టాలు తీరుతాయని, రాబోయే రోజుల్లో ‘తెలంగాణ రాష్ట్ర సేన’ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని పిలుపునిచ్చారు. పాంచజన్యం పేరుతో విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యవసాయం, సామాజిక తెలంగాణ అంశాలను లేవనెత్తారు. వీటికోసం అహర్నిశలు శ్రమిస్తామని హామీ ఇచ్చారు.
మునీరాబాద్ వేదికగా కవిత చేసిన ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. సొంత కుటుంబంపైనే తిరుగుబావుటా ఎగురవేయడం ఒక ఎత్తయితే.. గతంలో కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పేరును ఎంచుకోవడం మరింత ఆసక్తి రేపుతోంది. మరి కొత్త పార్టీ పెట్టిన కవితకు ప్రజలు ఎలాంటి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








