Constable Sowmya: జోహార్ సౌమ్య..! లక్ష్యం కోసం పోరాడి వీరమరణం!!
నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం కలచివేస్తోంది. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు.. అంకితభావానికి, ఒక మధ్యతరగతి కలల విచ్ఛిన్నానికి నిలువెత్తు సాక్ష్యం. నిబద్ధత గల ఒక యువ ఉద్యోగి ప్రాణాలను మత్తు మాఫియా బలితీసుకున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.
సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఆ యూనిఫామ్ వేసుకోవాలని కలలు కనింది. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, చట్టాన్ని కాపాడాలన్నా ఖాకీ దుస్తుల్లోనే సాధ్యమని నమ్మింది. అందుకే మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి, తన కలలను నిజం చేసుకుంది. కేవలం 20 నెలల క్రితమే విధుల్లో చేరిన ఆమె, తన వృత్తి పట్ల ఎంతటి నిబద్ధతతో ఉందో ఆమె చివరి పోరాటమే చెబుతుంది.
జనవరి 23వ తేదీ నిజామాబాద్ నగర శివారులో గంజాయి ముఠా కదులుతుందన్న సమాచారంతో ఎక్సైజ్ బృందం అప్రమత్తమైంది. ఎక్సైజ్ ఎస్సైతో కలిసి సౌమ్య రంగంలోకి దిగింది. ముఠా సభ్యులు కారులో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ధైర్యంగా వారిని అడ్డుకునేందుకు సౌమ్య ప్రయత్నించింది. అయితే, మానవత్వం లేని ఆ స్మగ్లర్లు ఆమెపైకి కారును పోనిచ్చారు. ఆ కారు కింద పడి నలిగిపోయినా, సౌమ్య ధైర్యం మాత్రం చెక్కుచెదరలేదు.
తీవ్ర గాయాలైన సౌమ్యను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యులే విస్తుపోయారు. రెండు వైపులా పక్కటెముకలు విరిగిపోయాయి. ముఖ్యమైన అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఒక కిడ్నీని కూడా తొలగించాల్సి వచ్చింది. సుమారు 8 రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉండి, మృత్యువుతో పోరాడి చివరికి 9వ రోజున ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, విధి ఆమెను తీసుకెళ్లిపోయింది.
సౌమ్య మరణంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. “తను మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిందని, పోలీస్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని” కన్నీరుమున్నీరవుతున్న ఆమె తల్లి మాటలు గుండెలను పిండేస్తున్నాయి. గంజాయి అనే మహమ్మారిని సమాజం నుంచి తరిమికొట్టాలని వెళ్లిన తమ బిడ్డ, అదే మహమ్మారికి బలైపోతుందని వారు ఊహించలేకపోయారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, వారికి కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సౌమ్య మరణం మన ముందు కొన్ని కీలక ప్రశ్నలను ఉంచుతోంది. గంజాయి స్మగ్లర్లు అధికారుల పైకే వాహనాలను పోనిస్తున్నారంటే వారిలో చట్టం పట్ల భయం ఎంత తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఆపరేషన్లకు వెళ్లే సమయంలో సిబ్బందికి తగినంత రక్షణ, ఆధునిక పరికరాలు ఉన్నాయా? అన్నది ఆలోచించాల్సిన విషయం. మత్తు పదార్థాల వల్ల కేవలం వాడేవారే కాదు, సమాజాన్ని కాపాడే వారు కూడా బలైపోతున్నారు.
సౌమ్య చనిపోలేదు.. తన విధి నిర్వహణలో వీరమరణం పొందింది. మత్తులేని సమాజం కోసం ఆమె చేసిన పోరాటం ప్రతి యువ అధికారికి స్ఫూర్తిదాయకం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడమే ఆమెకు మనం ఇచ్చే అసలైన నివాళి.






