వస్తామన్నా వద్దంటున్న తెలంగాణ బీజేపీ!?
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని కలలు కంటున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు బయటి ప్రత్యర్థుల కంటే లోపలి శత్రువులే ఎక్కువయ్యారు. కొత్త రక్తాన్ని ఎక్కించుకుని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో.. కొందరు నేతలు చేరికలకు బ్రేక్ వేస్తున్నారు. కొత్త వాళ్లు వస్తే తమ ఉనికికి ఎక్కడ ముంపు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. దీంతో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పగ్గాలు చేపట్టినప్పటి నుండి పార్టీని ఒకతాటిపైకి తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన నిరంతరం జిల్లాల్లో పర్యటిస్తూ, కార్యకర్తలను కలుస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అధ్యక్షుడు పడుతున్న కష్టానికి ఇతర ముఖ్య నాయకుల నుండి ఆశించిన మద్దతు లభించడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి. పార్టీని తమ సొంత సంస్థగా భావించి పని చేయాల్సిన అగ్ర నేతలు, కేవలం తమ వ్యక్తిగత అజెండాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏ పార్టీలోనైనా పాత వారు, కొత్తగా వచ్చిన వారి మధ్య చిన్నపాటి ఘర్షణలు సహజం. కానీ తెలంగాణ బీజేపీలో ఈ అంతరం అంతకంతకూ పెరుగుతోంది. ఇతర పార్టీల నుండి వచ్చిన సీనియర్ నేతలకు, పార్టీని నమ్ముకున్న పాత కాపులకు మధ్య సయోధ్య కుదరడం లేదు. బయటకు అందరూ నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఎదుటివారిని తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కవరింగ్ రాజకీయాల వల్ల పార్టీ ఎదుగుదల కుంటుపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని భావించి, కాషాయ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న పెద్ద తలకాయలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పార్టీలో ఉన్న నేతలేనని తెలుస్తోంది. ఎవరైనా కొత్త నేతలు పార్టీలోకి వస్తామంటే, ప్రస్తుతం ఉన్న నాయకులు వారిని ప్రోత్సహించాల్సింది పోయి, “మాకే దిక్కు లేదు, మమ్మల్ని ఇక్కడ ఎవరూ గౌరవించడం లేదు, మీరు వచ్చి ఏం చేస్తారు?” అంటూ భయపెట్టి నిరుత్సాహపరుస్తున్నారట. ఈ పరిస్థితి వల్ల పార్టీలోకి రావాలనుకున్న వారు పెనం మీద నుంచి పొయ్యిలో పడటం ఎందుకని భావిస్తూ ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
బీజేపీలో నెలకొన్న ఈ వింత పరిస్థితికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని, కేవలం ముహూర్తం మాత్రమే బాకీ ఉందని పార్టీ నేతలే స్వయంగా ప్రచారం చేశారు. కానీ అనూహ్యంగా ఆయన కమలాన్ని కాదని గులాబీ గూటికి చేరుకున్నారు. ఆయన పార్టీ మారడానికి బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన కారణమని ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది. ఒక సీనియర్ నేతను కూడా పార్టీలోకి ఆహ్వానించి, నిలబెట్టుకోలేని స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని, వారికి ఉన్నత పదవులు ఇచ్చి పార్టీని అధికారంలోకి తెస్తున్న హైకమాండ్ వ్యూహాలు తెలంగాణలో మాత్రం రివర్స్ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ సిద్ధంగా ఉన్నా, నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఈ అంతర్గత విబేధాలను పరిష్కరించకుంటే, అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి








