మహిళా రిజర్వేషన్ల చట్టం 21 వ శతాబ్దపు నిర్ణయాల్లోనే అత్యంత కీలకం : మోదీ
మహిళా రిజర్వేషన్ చట్టంతో (నారీ శక్తి వందన్ అధినియం) ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సముచిత స్థానం కల్పించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendr Modi) అన్నారు.
21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు. ఢిల్లీలో సోమవారంనాడు నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని, మహిళల రిజర్వేషన్ల బిల్లు అత్యావశ్యకమని అన్నారు. 2029 లోగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని నొక్కి చెప్పారు. సమానత్వం, సామాజిక న్యాయం అనేవి కేవలం నినాదం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతిలో సహజంగా వుంటుందన్నారు. ఈ బిల్లుతో దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీస్సులను పొందబోతున్నామని ప్రకటించారు.
మహిళా సాధికకారత చట్టం 2029 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేయాలని తాము సంకల్పించామని, ఈ గడువునే తాము దృష్టిలో వుంచుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. దీనిపై ఈ నెల 16 నుంచి పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరుగుతోందని పునరుద్ఘాటించారు. అయితే ఈ ప్రక్రియ అంతా పరస్పర అగాహన, సహకారం, అందరి భాగస్వామ్యంతో జరగాలన్నదే తమ ప్రభుత్వ తాపత్రయమని మోదీ పేర్కొన్నారు.
భారత్ లో మహిళలు ఏ పదవిని అలంకరించినా, ఎప్పుడూ తమదైన చరిత్రను సృష్టించారని ప్రధాని గుర్తు చేశారు., రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు దేశంలోని కీలక పదవులను వారు నిర్వహించారన్నారు. అంతేకాకుండా, భారతదేశంలోని స్థానిక ప్రభుత్వ సంస్థలలో 14 లక్షల మందికి పైగా మహిళలు విజయవంతంగా సేవలందిస్తున్నారని కూడా గుర్తు చేశారు.
నిర్ణయాలు తీసుకునే స్థాయిలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల వ్యవస్థలలో సున్నితత్వం, స్పందించే గుణాలు పెరుగుతాయని అనేక అధ్యయనాలు కూడా పేర్కొన్నాయని అన్నారు. దేశంలోని 21 రాష్ట్రాలలోని పంచాయతీలలో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరుకుందని, ఈ విషయం తాను అంతర్జాతీయ వేదికలపై పదే పదే చెబుతుంటానని అన్నారు. వారంతా ఆశ్చర్యపోతారని మోదీ వెల్లడించారు. ఇదేమీ చిన్న విషయం కాదని, ఇదో చరిత్ర అని, దీనిని చూసి ప్రపంచ నేతలు విస్తుపోతున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి








