YS Sharmila: బస్ కోసం ఆర్టీసి అధికారులకు షర్మిల ఫోన్, అసలేం జరిగింది..?
పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతోన్న ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన రూట్ మార్చారు. నక్కపల్లి మండలం వెదురుపాలెం గ్రామంలో ఉపాధి హామీ శ్రామికురాలుగా మారిపోయారు షర్మిల. ఉపాధి హామీ పనులు చేస్తూ.. గ్రామస్థులతో షర్మిల మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాలు న్యాయంపూడి, ఏదులపాలెం మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని షర్మిల దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. తాము స్థానిక అధికారులతో మాట్లాడినా పని జరగడం లేదని వాపోయారు.
బస్సులు ఆగకపోవడంతో పిల్లలు బడికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే రచ్చబండ వేదికగా ఆర్టీసీ(Apsrtc) ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి బస్సులు ఆపాలని షర్మిల కోరారు. షర్మిల రిక్వస్ట్ చేయడంతో బస్సులు ఆపుతామని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. ఇక అనంతరం రచ్చబండలో మాట్లాడిన షర్మిల.. ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరమన్నారు. మన్రేగా పథకాన్ని మోదీ(Narendra Modi) బ్రస్టు పట్టించాడని మండిపడ్డారు. చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేశారని విమర్శించారు షర్మిల.
కొత్త నిబంధనలు పెట్టి ఉపాధి పనికి ఇబ్బందులు తెచ్చారని, ఇప్పుడు ఏకంగా మన్రేగా చట్టాన్ని రద్దు చేశారని, వీబీ జీ- రాం జీ అని పనికి రాని చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. మోడీ తెచ్చిన కొత్త చట్టం రాష్ట్రానికి భారమని, రాష్ట్రం మీద 40 శాతం భారం మోపడం అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పుల్లో ఉందన్న షర్మిల.. జగన్, చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల పాలు చేసారని ఆరోపించారు. 125 రోజులు పని కల్పన అనేది పచ్చి మోసమని ఆగ్రహం వ్యక్తం చేసారు. సగటున 100 రోజుల పని పథకంలో 52 రోజులు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో జాబ్ కార్డులు భారీగా తొలగించారని విమర్శించారు షర్మిల.








