MAVIGUN: జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన ‘మావిగన్’!
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ముగిసిపోయిన అధ్యాయం అనుకుంటున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకు “మూడు రాజధానుల” మంత్రాన్ని జపించిన జగన్, ఇప్పుడు అనూహ్యంగా ‘మావిగన్’ (MAVIGAN) అనే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచిన తరుణంలో, జగన్ వ్యూహాత్మకంగా ఈ ‘ప్లాన్-బి’ని తెరపైకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జగన్ ప్రతిపాదన ప్రకారం, రాజధాని అంటే కేవలం ఒక ప్రాంతానికో లేదా కొన్ని గ్రామాలకో పరిమితం కాకూడదు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలను కలుపుతూ ఒక భారీ మెగా సిటీని రాజధానిగా ప్రకటించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం.
విజయవాడ నుండి మచిలీపట్నం వరకు 70 కి.మీ, విజయవాడ నుండి గుంటూరు వరకు 40 కి.మీ.. మొత్తంగా ఈ 110 కి.మీ మేర విస్తరించి ఉన్న నేషనల్ హైవే పరిధిని రాజధానిగా ప్రకటించాలని ఆయన సూచించారు. మచిలీపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN)ల కలయికతో దీనికి ‘మావిగన్’ అని నామకరణం చేశారు. అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు, అందులో కేవలం 10శాతం అంటే సుమారు రూ. 20 వేల కోట్లు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తే చాలని ఆయన వాదిస్తున్నారు. గత ఐదేళ్లుగా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని, అమరావతి కేవలం శాసన రాజధాని అని గట్టిగా వాదించిన జగన్, ఇప్పుడు అకస్మాత్తుగా గుంటూరు-విజయవాడ ప్రాంతంపై మక్కువ చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏపీ రాజధాని అంశం గత పదేళ్లుగా సాగుతున్న తీరు చూస్తుంటే సామాన్య ప్రజలకు ఇది ఒక అంతుచిక్కని ప్రహసనంగా కనిపిస్తోంది. కూటమి అమరావతికి కట్టుబడి ఉంది. దాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్తోంది. జగన్ మాత్రం మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఉండాలంటున్నారు. దానికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఒక రాష్ట్రానికి రాజధాని అనేది గౌరవానికి, ఆర్థిక వృద్ధికి చిహ్నం. కానీ ఏపీలో ప్రతి ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజధాని పేరును, ప్రాంతాన్ని మార్చేస్తుండటం వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం సడలుతోంది. “రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లాంటి రాజధాని కావాలి” అని జగన్ అంటున్న మాట వాస్తవమే అయినా, దానికి పదే పదే కొత్త పేర్లు, కొత్త సరిహద్దులు పెట్టడం వల్ల ప్రజల్లో అయోమయం తప్ప ప్రయోజనం కనిపించడం లేదు.
అమరావతిపై చంద్రబాబు పంతం.. ‘మావిగన్’పై జగన్ కొత్త పంతం.. మధ్యలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఊగిసలాడుతోంది. కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తుంటే, జగన్ ప్రతిపాదించిన ఈ 110 కిలోమీటర్ల మేర విస్తరించిన మెగా సిటీ కాన్సెప్ట్ రాజకీయంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. ఏదేమైనా, ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, దురదృష్టవశాత్తు అది అభివృద్ధి పరంగా కాకుండా రాజకీయం పరంగా!
ఇవి కూడా చదవండి








