MaViGun: నవ్వులపాలవుతున్న జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా ‘రాజధాని’ అనే అంశం ఒక ముగింపు లేని ప్రహసనంలా సాగుతోంది. మూడు రాజధానులంటూ గతంలో చేసిన ప్రయోగాలు విఫలమై, ప్రస్తుతం అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ అనే వింత పేరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాస్యాస్పదంగా మారింది. సీరియస్ రాజకీయాలు చేయాల్సిన సమయంలో జగన్ ఇలాంటి వింత పేర్లతో ముందుకు రావడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
అక్షరాలను కలిపి ఏదో ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరులా వినిపిస్తున్న ఈ ‘మావిగన్‘ అనే పదం వినగానే జనం నోరెళ్లబెడుతున్నారు. అసలు ఈ పేరు ఎక్కడ నుండి పుట్టింది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అని ఆరా తీస్తున్నారు. రాజధాని విషయంలో ఇప్పటికే ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించాల్సింది పోయి, ఇలాంటి అల్లాటప్పా పేర్లతో కాలయాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “గతంలో మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ఈ కొత్త ‘గన్’ ఎక్కడి నుండి వచ్చింది?” అంటూ సామాన్యులు జోకులు వేసుకుంటున్నారు.
ఈ ‘మావిగన్’ పేరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మీడియా ప్రతినిధులు ఈ పేరును ప్రస్తావించగానే, పవన్ కళ్యాణ్ ఆపుకోలేక నవ్విన తీరు జగన్ రాజకీయ పరిజ్ఞానంపై ఆయనకున్న అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. “ఇన్ని వింత పేర్లు వీరికి ఎక్కడ దొరుకుతాయో ఏమో!” అన్నట్లుగా పవన్ ఇచ్చిన ఆ వెటకారపు నవ్వు, జగన్ ప్రతిపాదన ఎంత సిల్లీగా ఉందో చెప్పకనే చెప్పింది.
ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన వ్యక్తి, ఇలాంటి హాస్యాస్పదమైన మాటలతో నవ్వులపాలవ్వడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవన్ నవ్వు జగన్ వైఖరికి ఒక బలమైన మౌన కౌంటర్ లా మారిందని చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో ‘మావిగన్’ పై రచ్చ మామూలుగా లేదు. “మావిగన్ అంటే ఏదో కొత్త రకమైన విదేశీ తుపాకీ పేరులా ఉంది” అని కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు “సీజన్ మారినప్పుడల్లా రాజధాని పేరు మార్చడం జగన్ కే చెల్లింది” అని విమర్శిస్తున్నారు. జగన్ పాత వీడియోలను, ఇప్పటి మావిగన్ మాటలను కలిపి నెటిజన్లు క్రియేటివ్ పేరడీ వీడియోలు సృష్టిస్తున్నారు. ఒక సీరియస్ రాజకీయ అంశాన్ని జగన్ కామెడీ షోగా మార్చేశారని, అందుకే ఆయనను విమర్శించాలన్నా జాలి వేస్తోందని నెటిజన్లు ‘పాపం జగన్’ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు.
అమరావతిని అడ్డుకోవడానికి జగన్ ఎన్ని దారులు వెతికినా చివరకు ఇలాంటి సిల్లీ ప్రతిపాదనల దగ్గరే ఆగిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తున్నా సరే, ఇంకా ఏదో ఒక వింత పేరుతో కాలయాపన చేయడం వల్ల పార్టీకే నష్టమని వైసీపీ నేతలు కూడా లోలోపల మదనపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి, ‘మావిగన్’ పేరుతో జగన్ రెడ్డి తన రాజకీయాల్లో మరో ‘సెల్ఫ్ గోల్’ వేసుకున్నారని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన రాజధాని అంశాన్ని ఒక కుళ్లు జోక్ స్థాయికి తగ్గించేలా జగన్ వ్యవహరించడం శోచనీయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అయితే, అది బెడిసికొట్టి జగన్ ఇమేజ్ను మరింత డ్యామేజ్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇవి కూడా చదవండి








