Byreddy Shabari: సిద్ధార్థ రెడ్డి పై బైరెడ్డి శబరి సెన్సేషనల్ స్టేట్మెంట్..
నంద్యాల ఎంపీ (Nandyal MP) బైరెడ్డి శబరి (Byreddy Shabari) వైసీపీ (YCP) నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై (Byreddy Siddhartha Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. కూటమి ప్రభుత్వంలో కేసులు, అరెస్టులపై సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేస్తూ, ఆ సమయంలో తమ కార్యకర్తలపై జరిగిన దాడులను ప్రస్తావించారు.
మీడియాతో మాట్లాడిన శబరి, అభివృద్ధి గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అదే విధంగా సిద్ధార్థ్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ రావడం లేదని, అందుకే ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాలలో విమర్శలు సహజమే కానీ, నిజాలు మాట్లాడాలన్నారు. సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం అరెస్టులు, కేసుల గురించి మాట్లాడుతున్నారని, కానీ గతంలో తనపై కేసులు పెట్టించారని ఆమె ఆరోపించారు. తనను అక్కగా భావించకుండా కుట్రలు పన్నారని, తన కార్యకర్తలపై దాడులు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతేకాదు, తన తల్లిపై కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. తల్లి, చెల్లెల్ని ఎలా చూడాలో జగన్ (Jagan) ప్రభుత్వానికే తెలుసని, అదే విధంగా సిద్ధార్థ్ రెడ్డికి కూడా తెలుసని ఎద్దేవా చేశారు.
జగన్ మళ్లీ రావాలని కోరుతున్న సిద్ధార్థ్ రెడ్డి, నిజంగా ప్రజల భవిష్యత్తును ఆలోచిస్తున్నారా లేక కల్తీ మద్యం, గంజాయిని ప్రోత్సహించడానికే మళ్లీ రావాలని కోరుతున్నారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమైనవే అయినా, వాటికి హద్దులు ఉండాలని సూచించారు. సిద్ధార్థ్ రెడ్డికి స్క్రిప్ట్ బాగా చదవడం తెలుసని, అందుకే ఆయన సినిమాల్లో ప్రయత్నిస్తే బెటర్ అని సలహా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందేనని, దోషులకు శిక్ష తప్పదని అన్నారు. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయని, ఇది ఎంతటి ప్రమాదకరమైన పరిణామమో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో, కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని పరామర్శించిన శబరి, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎప్పుడూ నిలబడతానని, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని నంద్యాల ఎంపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఏయే వర్గాలు ఏమి మాట్లాడినా, నిజాయితీతో ముందుకు వెళ్లడం మాత్రమే తన ధ్యేయమని అన్నారు.













