వైసీపీలో టికెట్లు, మంత్రి పదవుల కోసం మత మార్పిడులు..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ, సీనియర్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద ప్రసంగంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరిని బయటపెట్టాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార భారతీయ జనతా పార్టీ (BJP), తెలుగుదేశం పార్టీ (TDP), జనసేనతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు వెంటనే స్పందించి తమ స్టాండ్‌ను స్పష్టం చేయాలని కోరారు.
రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకున్న తీరుపై విజయసాయిరెడ్డి నేరుగా వైసీపీ నాయకత్వాన్ని కడిగిపారేశారు. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎంతమంది నాయకులు తమకు ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవులను దక్కించుకోవడం కోసం మతాలు మార్చుకున్నారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం జగన్‌గారిని ఆకట్టుకునేందుకు కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారారనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
ఈ వ్యవహారాలన్నింటికీ ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నంబర్ వన్ స్థానంలో ఉన్నారో.. వారే సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. పదవుల కోసం మత మార్పిడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమో వైసీపీ అగ్రనాయకత్వమే సమాధానం ఇవ్వాలన్నారు. సొంత పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్న వేళ విజయసాయిరెడ్డి నేరుగా వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








