అమరావతిలో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం
అమరావతి కేంద్రంగా ఆవిష్కృతమైన క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో సాంకేతిక శకంలో కొత్త అధ్యాయానికి ఏపీ నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఇటీవల ప్రారంభించారు. దీంతో అమరావతి క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో కీలక కేంద్రంగా మారనుంది. ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీతో పాటు, మేధా టవర్స్‌లోని 1క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ఆవిష్కరించారు. ఈ రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే, ధృవీకరించే సామర్థ్యం రాష్ట్రానికి లభించింది. ఈ ఫెసిలిటీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి -273 డిగ్రీల సెల్సియస్ వద్ద పనిచేసే విధంగా రూపొందించ బడ్డాయి. ఈ స్థాయి సాంకేతికతతో క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్ పనితీరును పరీక్షించడం, విశ్లేషించడం సాధ్యమవుతుంది. దీంతో అమరావతి “క్వాంటం వ్యాలీ” గా ఎదగడానికి బలమైన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం ఉపకరణాల తయారీ కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు పెద్ద ఎత్తున ఉపయోగం కలగనుంది. ఇది పరిశోధన, ఇన్నోవేషన్లకు కీలక వేదికగా మారనుంది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిపార్ట్మెంట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు, వివిధ క్వాంటం టెక్నాలజీ సంస్థల నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలుహాజరయ్యారు. దేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా భావిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న రెండు క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీల్లోనూ పూర్తిగా స్వదేశీ ఉపకరణాలనే ఉపయోగించారు.
మేధాటవర్స్‌లో క్వూబిటెక్ సంస్థ 1క్యూ పేరిట క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేసింది. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో 1ఎస్ పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటమ్ టెస్ట్ బెడ్‌ను నిర్మించారు. ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ఏర్పాటులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓలాంటి సంస్థల సహకారం ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరవుతారు.
అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుతోపాటు, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లను, విడిభాగాల్ని అక్కడే తయారుచేసి ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గత ఏడాది సెప్టెంబరు 9న హార్డ్‌వేర్ విడిభాగాల తయారీదారులతో ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో క్వాంటమ్ విడిభాగాల టెస్టింగ్, వ్యాలిడేషన్, బెంచ్‌మార్కింగ్, సర్టిఫికేషన్ కోసం రిఫరెన్స్ సదుపాయాలు కావాలని కోరారు. అమరావతిలో రిఫరెన్స్ ఫెసిలిటీస్‌ను కల్పించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. ఈ సదుపాయాలు రావడంతో అమరావతిలోనే క్వాంటమ్ పరికరాలు తయారు చేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకొచ్చే అవకాశముంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటమ్ విడిభాగాలు తయారు చేస్తున్నా, ప్రాసెసర్ల వంటివాటిని టెస్టింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అమరావతి రిఫరెన్స్ ఫెసిలిటీస్‌తో క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీ రంగంలో భారత్ పెద్ద ముందడుగు వేయనుంది.
అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం తయారు చేసిన క్రయోజెనిక్స్, ప్రిసిషన్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలు కేవలం క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకే కాకుండా, రక్షణ, ఆరోగ్య, సెమీకండక్టర్ తయారీవంటి రంగాలకూ ఉపయోగ పడతాయన్నది నిపుణులు చెబుతోన్న మాట. క్రయోజెనిక్ సిస్టమ్స్‌ను ఎంఆరఐ మెషీన్లు, స్పేస్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సెన్సింగ్, రాడార్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్కు ఉపయోగ పడుతుంది. క్వాంటమ్గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలను సెమీకండక్టర్ల తయారీ, డీప్‌టెక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. క్వాంటమ్ కంప్యూ టర్‌తో రాష్ట్రానికి కొత్త కళ రానుంది. ఇదే ఊపుతో.. అమరావతిలో వచ్చే డిసెంబరులోగా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుతోపాటు.. క్వాంటమ్, ఏఐ టెక్నాలజీల పరిశోధనలు, అల్గారిథమ్స్, యూజ్ కేసుల రూపకల్పనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో “క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర” పనులు మొదలయ్యాయి. వచ్చే మూడేళ్లలో 100 క్వాంటమ్-ఏఐ అల్గారిథమ్స్, యూజ్ కేసులు అభివృద్ధి చేయడం, 5 వేలమంది విద్యార్థుల్ని క్వాంటమ్ అల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్దడం, క్వాంటమ్ టెక్నాలజీపై 600 మందికిపైగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, 100 స్టార్టప్‌లు ప్రారంభమయ్యేలా చూడటం, 100 పత్రాల ప్రచురణ, వందకుపైగా పేటెంట్ల సాధన, 50కి పైగా పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని లక్ష్యాలుగా పెట్టుకుంది. అమరావతి క్వాంటమ్‌వ్యాలీ మిషన్ డైరెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే గవర్నింగ్ కౌన్సిల్లో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల ప్రొఫెసర్లు, ఐబీఎం సంస్థ ప్రతినిధులు, రాష్ట్రంలోని 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్‌నుంచి నలుగురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం గన్నవరంలోని మేధాటవర్స్ నుంచి నడిచే క్వాంటమ్ ఇనోవేషన్ సెంటర్ అమరావతిలో భవన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నుంచి పని చేస్తుంది.
ఐబీఎంవంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లు వినియోగించుకున్నందుకు నిమిషాల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. ప్రస్తుతం ఒకేసారి 5,400 నిమిషాల సమయం కొనుగోలు చేస్తే ఐబీఎం నిమిషానికి 48 డాలర్లు వసూలు చేస్తోంది. ఏడాదిలోగా ఆ సమయాన్ని వాడేసుకోవాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇలా తక్కువ సమయం కావాలనుకున్న వారి నుంచి నిమిషానికి 96 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది. ఇలా నిమిషాల లెక్కన కేటాయించే సమయాన్నే క్వాంటమ్ క్రెడిట్స్ అంటారు.
అమరావతిలో ఏర్పాటు చేసే 133 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ క్వాంటమ్ కంప్యూటర్‌కూ ఐబీఎం ఇవే ధరల్ని నిర్ణయించే అవకాశముంది. అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటర్ను రోజుకు గంట చొప్పున ఉచితంగా వాడుకునేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ఐబీఎం అవకాశమివ్వాలన్నది ఒప్పందంలో భాగం. ఐబీఎం ఉచితంగా ఇచ్చే క్వాంటమ్ క్రెడిట్స్‌ను “క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర” రూపొందించిన అల్గారిథమ్స్‌ను రన్ చేయడం, యూజ్ కేసులు సిద్ధం చేయడానికి వాడతారు.








