AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల విజయం తర్వాత అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించాల్సిన సమయంలో.. వీధుల వెంట జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు రాష్ట్ర భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ల చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
నిన్న అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాల్సింది పోయి, బూతులతో కూడిన విమర్శలు చేయడం ఖచ్చితంగా గర్హనీయం. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమనడం సహజమే అయినప్పటికీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆయన ఇంటిపై దాడి చేయడం సమర్థనీయం కాదు. పోలీసులు రంగప్రవేశం చేసి అంబటిని అరెస్ట్ చేయడంతో ఆ వివాదం ముగిసిందనుకున్న తరుణంలో, నేడు మరో కొత్త మంట రాజుకుంది.
మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేశ్ చేసిన విమర్శలను సాకుగా చూపి టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పు పెట్టడం అత్యంత దారుణమైన విషయం. అంబటి చేసిన వ్యక్తిగత దూషణలతో పోలిస్తే, జోగి రమేశ్ చేసినవి రాజకీయ విమర్శలుగానే పరిగణించవచ్చు. కానీ, చిన్న విమర్శను కూడా సహించలేక ఇళ్లకు నిప్పు పెట్టే స్థాయికి రాజకీయాలు దిగజారడం ఆందోళనకరం. “వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై విసుగు చెందే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. మళ్ళీ అదే పద్ధతులను టీడీపీ కేడర్ అనుసరిస్తే.. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏముంటుంది?” అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవజ్ఞుడు, సంయమనం పాటించే వ్యక్తి. ఆయన ఎప్పుడూ అభివృద్ధి, వ్యవస్థల ప్రక్షాళన గురించి మాట్లాడుతుంటారు. అయితే, పార్టీ కేడర్ మాత్రం నాయకుడి మౌనాన్ని ‘చేతగానితనం’గా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. “మాపై దాడులు జరిగినప్పుడు మేం భరించాం, ఇప్పుడు మా టైమ్ వచ్చింది” అనే పగతో రగిలిపోతున్న కేడర్, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే, పెట్టుబడులు రావు సరి కదా.. ఉన్న కంపెనీలు కూడా తరలిపోయే ప్రమాదం ఉంది. కేడర్ చేసే ఇటువంటి పనులు చివరకు ప్రభుత్వంపైనే మచ్చ తెస్తాయి.
ఇది కేవలం ఒక పార్టీ కార్యకర్తల ఉద్రేకం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, అరాచకాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని కఠిన సందేశం పంపాలి. గత ప్రభుత్వ అవినీతిపై లేదా దాడులపై విచారణ జరిపి, చట్టబద్ధంగా శిక్షించాలే తప్ప వీధి పోరాటాలు పరిష్కారం కావు. ప్రతిపక్షాలు కూడా నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బూతు పురాణాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్ల నష్టపోయేది వారే అని గ్రహించాలి.
ప్రజలు మార్పును కోరుకుని ఓటేశారు. ఆ మార్పు అభివృద్ధిలో, పరిపాలనలో కనిపించాలే తప్ప దాడులలో కాదు. రాష్ట్రం వల్లకాడు కాకుండా ఉండాలంటే, ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని అరాచక శక్తులపై మోపాలి. అది ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా సరే! శాంతియుత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకుల భుజస్కంధాలపై ఉంది.






