YCP: సీఈసీ అభిశంసన… వైసీపీకి అగ్నిపరీక్ష!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అనుసరిస్తున్న వ్యూహాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) అభిశంసన విషయంలో ఆ పార్టీ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేదానిపై చర్చ జరుగుతోంది.
2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుండి వైసీపీ నేతలు ఒకటే వాదనను బలంగా వినిపిస్తున్నారు. కూటమి ప్రజాబలంతో గెలవలేదని, EVMల మేనేజ్మెంట్తో గెలిచిందని చెప్తున్నారు.! ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC)ని అభిశంసించే ప్రక్రియ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే వైసీపీ ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆ పార్టీ భవిష్యత్తు విశ్వసనీయతను నిర్ణయించే అంశం.
ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలోనూ, బహిరంగ సభల్లోనూ EVMల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశాయి. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని జగన్ స్వయంగా ఆరోపించారు. ఇప్పుడు CEC జ్ఞానేశ్ కుమార్ ని అభిశంసించాలంటూ విపక్షాలన్నీ ఏకమై సంతకాలు చేసి నోటీసులు ఇచ్చాయి. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి, ఓటింగ్ ప్రక్రియ జరిగితే, దానికి వైసీపీ మద్దతు తెలపాలి. ఎందుకంటే, తమ ఓటమికి కారణమని భావిస్తున్న వ్యవస్థపై పోరాడటానికి ఇదొక గొప్ప అవకాశం.
ఇవి కూడా చదవండి
వైసీపీ నిత్యం నైతికత, విలువల గురించి మాట్లాడుతూ ఉంటుంది. తాము మాట తప్పం, మడమ తిప్పం.. అని చెప్పుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఈసీపై అభిశంసన ఆ పార్టీ విలువలకు పెద్ద పరీక్ష పెట్టబోతోంది. ఒకవేళ వైసీపీ CECకి అనుకూలంగా ఓటు వేస్తే లేదా అభిశంసనను వ్యతిరేకిస్తే, ఇకపై EVMల గురించి గానీ, ఎన్నికల అక్రమాల గురించి గానీ మాట్లాడే హక్కును ఆ పార్టీ కోల్పోతుంది. వ్యవస్థపై విమర్శలు చేస్తూనే.. అదే వ్యవస్థలోని ఉన్నతాధికారికి అండగా నిలబడటం అనేది ఆ పార్టీ రెండు నాలుకల ధోరణకి అద్దం పడుతుంది. అభిశంసన సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం లేదా తటస్థంగా వ్యవహరించడం కూడా వైసీపీ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తుంది. ఇది పరోక్షంగా అధికార కూటమికి లేదా వ్యవస్థకు సహకరించినట్లే అవుతుందని విశ్లేషకులు భావిస్తారు.
“మాకు ఈవీఎంలపై నమ్మకం లేదు.. బ్యాలెట్ విధానం రావాలి” అని వైసీపీ పదే పదే డిమాండ్ చేస్తోంది. ఎన్నికల కమిషన్ తీరుపై అసంతృప్తి ఉన్నప్పుడు, ఆ వ్యవస్థలో మార్పు కోరుకున్నప్పుడు, CEC అభిశంసన విషయంలో వైసీపీ కచ్చితమైన స్టాండ్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ వెనకడుగు వేస్తే, బ్యాలెట్ పేపర్ డిమాండ్ కేవలం ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి చెబుతున్న సాకుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
వైసీపీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వానికి కొన్ని కీలక బిల్లుల విషయంలో గతంలో మద్దతు ఇచ్చింది. అయితే, రాష్ట్రంలో మాత్రం కూటమి (TDP-JSP-BJP) తమ ప్రధాన శత్రువు అని చెబుతోంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘంపై వచ్చే అభిశంసనను కేంద్రం వ్యతిరేకిస్తే, అప్పుడు వైసీపీ ఏ పక్షాన నిలుస్తుంది? కేంద్రంతో సఖ్యత కోసం కూటమి వాదనకే మద్దతు ఇస్తే, జగన్ చెప్పే “విలువలు, నైతికత”కు అర్థం ఉండదు. ఇది కార్యకర్తల్లో కూడా అయోమయాన్ని సృష్టిస్తుంది.
వైసీపీ ఇప్పుడు ఒక సంకట స్థితిలో ఉంది. ఒకవైపు కేంద్రంతో ఉన్న రాజకీయ సంబంధాలు, మరోవైపు రాష్ట్రంలో తాము చేస్తున్న EVM వ్యతిరేక పోరాటం. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా ఉండాలంటే, వైసీపీ ఈ అంశంపై అత్యంత స్పష్టమైన, ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. CEC అభిశంసన విషయంలో వైసీపీ తీసుకునే నిర్ణయం.. ఆ పార్టీ భవిష్యత్తు పోరాటాలకు పునాదిగా మారుతుంది. ఇది కేవలం ఒక అధికారి తొలగింపు విషయం కాదు, వైసీపీ చెప్పే “న్యాయం, ధర్మం” అనే మాటలకు ఉన్న బరువును పరీక్షించే సమయం.







