మహిళా ఎమ్మెల్యేపై లోకేష్ ప్రసంశలు..!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి(Galla Madhavi) తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో, ఆమె ఒక ట్రాన్స్జెండర్ను తన వ్యక్తిగత సహాయకురాలిగా (PA) నియమించుకున్నారు. చదువుకున్నా కూడా అవకాశాలు దొరకక ఇబ్బంది పడుతున్న సదరు ట్రాన్స్జెండర్ అర్హతను గుర్తించి, ఆమెకు ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించారు ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. అణగారిన వర్గాల సాధికారతకు గల్లా మాధవి పెద్దపీట వేశారని, ఇది సామాజిక మార్పుకు నిజమైన నిదర్శనమని ఆయన కొనియాడారు. సమాజంలో మనం చూడాలనుకుంటున్న ప్రగతిశీల మార్పు ఇదేనని, నాయకత్వం అంటే వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేయడమేనని లోకేష్ స్పష్టం చేశారు.
గల్లా మాధవి నిర్ణయం ఇతర ప్రజాప్రతినిధులకు ఒక ‘గోల్డెన్ స్టాండర్డ్’ అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. మానవత్వాన్ని చాటిచెబుతూ అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఆమెకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో సామాజిక న్యాయాన్ని చూపిస్తూ గల్లా మాధవి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో ఉన్న దృక్పథాన్ని మార్చడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, రైళ్లలో వారు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో కూడా ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.








