Bhumana: ‘హిందూత్వ’ ముద్ర కోసం భూమన ఆరాటం?
ఆధ్యాత్మిక నగరి తిరుపతి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే, గత కొంతకాలంగా వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న ‘హిందూ వ్యతిరేకి’ ముద్రను చెరిపేసుకునేందుకు భూమన వేస్తున్న అడుగులు, తాజాగా జరిగిన ఒక ముస్లిం దంపతుల మత మార్పిడి ఉదంతం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
తిరుపతికి చెందిన యాలమూరి శ్రీనివాస్‌రెడ్డి, పుష్ప దంపతులు ఉపాధి కోసం సుమారు 27 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ఉన్న కాలంలో వారు ఇస్లాం మతాన్ని స్వీకరించి, తమ పేర్లను అబ్దుల్లా, అమీనాగా మార్చుకున్నారు. అన్ని అధికారిక పత్రాల్లోనూ అవే పేర్లతో కొనసాగారు. 2015లో భారతదేశానికి తిరిగి వచ్చిన వీరు తిరుపతిలోని పెద్దకాపు వీధిలో నివాసం ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న భూమన కరుణాకర్ రెడ్డి, స్వయంగా వారి ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు. హిందూ ధర్మం విశిష్టతను వారికి వివరించి, తిరిగి స్వధర్మానికి రావాలని ప్రేరేపించారు. ఫలితంగా, భూమన నివాసంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆ దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. అబ్దుల్లా మళ్ళీ శ్రీనివాస్‌రెడ్డిగా, అమీనా పుష్పగా తమ మూలాల్లోకి వచ్చారు.
ఇవి కూడా చదవండి
వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భూమనపై ప్రత్యర్థులు మొదటి నుంచీ ఒకే రకమైన దాడి చేస్తున్నారు. ఆయన నాస్తికుడని, దేవుడిని నమ్మరని, లోలోపల క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తారని రాజకీయ విమర్శలు నిత్యం వినిపిస్తుంటాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఒక ముస్లిం జంటను హిందూ మతంలోకి తీసుకురావడం ద్వారా తనపై ఉన్న వ్యతిరేక ప్రచారానికి భూమన గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఆస్థాన మండపంలో 90 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో నిర్వహించిన వేద విద్వత్ సదస్సులో ఒక తీర్మానం చేశారు. ఇతర మతాల నుంచి హిందూ మతంలోకి రావాలనుకునే వారికి తిరుమల శ్రీవారి సన్నిధినే వేదికగా చేయాలని, శ్రీవారే వారికి దిక్సూచి కావాలని ఆయన సంకల్పించారు. అయితే, ఈ లోపే ప్రభుత్వం మారిపోవడం, తదుపరి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ పక్రియ ఆగిపోయింది. ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో ఆయన ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వివాదంలో అప్పటి టీటీడీ బోర్డు పైనా, వైసీపీ ప్రభుత్వం పైనా హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో భూమన ఇలాంటి మత పునఃస్వీకరణ కార్యక్రమాలు చేపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీపై పడిన ‘హిందూ వ్యతిరేక’ ముద్రను తొలగించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ప్రశ్నార్థకమే. మత మార్పిడి చేసుకున్న దంపతులు భూమన కృషిని కొనియాడుతున్నప్పటికీ.. సాధారణ భక్తులు, రాజకీయ ప్రత్యర్థులు దీనిని కేవలం డ్యామేజ్ కంట్రోల్ చర్యగానే చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి








