AP Steel Plant: అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ ఉక్కు దిగ్గజాలు ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS) సంయుక్తంగా చేపట్టిన భారీ ‘గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‘ (AP Steel Plant) నిర్మాణానికి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద అట్టహాసంగా భూమిపూజ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులతో కలిసి ఈ మెగా ప్రాజెక్టుకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు.
ప్రాజెక్టు స్వరూపం..
ఈ భారీ ఉక్కు కర్మాగారం (AP Steel Plant) నిర్మాణాన్ని మొత్తం రెండు దశల్లో చేపట్టనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత భారీ పారిశ్రామిక పెట్టుబడిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ అక్షరాలా రూ.1,35,964 కోట్లు. మొత్తం 5,465 ఎకరాల విస్తీర్ణంలో, ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. మొదటి దశలో భాగంగా 2,600 ఎకరాల్లో రూ. 80 వేల కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించి, 2029 నాటికి ఉక్కు ఉత్పత్తిని వాణిజ్యపరంగా ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు. పరిశ్రమ ఎగుమతి, దిగుమతి అవసరాల కోసం కర్మాగారానికి అనుబంధంగా రూ.11,198 కోట్లతో సొంతంగా ఒక అత్యాధునిక క్యాప్టివ్ పోర్టును సైతం నిర్మించనున్నారు.
ఇవి కూడా చదవండి
లక్ష మందికి ఉపాధి..
ఈ ప్రాజెక్టు (AP Steel Plant) రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది. స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏకంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా, క్యాప్టివ్ పోర్టు ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీని రాకతో విశాఖ రీజియన్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా అవతరించనుంది. ప్లాంట్‌కు మెరుగైన రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారితో (NH-16) అనుసంధానిస్తూ నాలుగు లేన్ల విస్తరణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
ఈ అద్భుత ఘట్టంపై ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ హర్షం వ్యక్తం చేశారు. జన్మభూమికి తిరిగి ఇవ్వాలన్న సత్సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు (AP Steel Plant) చేపట్టినట్లు వెల్లడించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ సాధనలో ఉక్కు రంగం పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో గొప్ప విశ్వాసాన్ని నింపుతోందని, ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన స్థానిక ప్రజలకు సంస్థ సీఈవో ఆదిత్య మిత్తల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి








