RDT: ఆర్డీటీకి ‘విదేశీ’ ఊరట..! అనంత వాసులకు గ్రేట్ న్యూస్!!
ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని పేదలకు RDT (Rural Development Trust) కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదు, అదొక ఆశ కిరణం. గత కొంతకాలంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో ఈ సంస్థ మనుగడపై నీలినీడలు ముసురుకున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనంతపురం జిల్లా ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు విదేశీ నిధులను స్వీకరించాలంటే కేంద్ర హోం శాఖ నుండి FCRA అనుమతి తప్పనిసరి. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసింది. సాంకేతిక కారణాలు లేదా నిబంధనల ఉల్లంఘన నెపంతో దేశవ్యాప్తంగా వేలాది ఎన్జీవోల లైసెన్స్లు రద్దయ్యాయి. ఇదే క్రమంలో దశాబ్దాలుగా అనంతపురంలో సేవలందిస్తున్న ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరణ కూడా పెండింగ్లో పడింది. దీనితో సంస్థ ద్వారా నడుస్తున్న ఆసుపత్రులు, పాఠశాలలు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ సంక్షోభ సమయంలో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఆర్డీటీ సేవలు నిలిచిపోతే అనంతపురం జిల్లాలో వైద్య, విద్యా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని గుర్తించిన ఆయన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర అధికారులతో వరుస సంప్రదింపులు జరిపారు.
ఇవి కూడా చదవండి
ఐదు దశాబ్దాలుగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించిన ఈ ప్రస్థానం, ప్రస్తుతం మాంచో ఫెర్రర్ నేతృత్వంలో ఎలా కొనసాగుతుందో కేంద్రానికి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించి ఈ సమస్యను సాల్వ్ చేయడంలో లోకేశ్ సక్సెస్ అయ్యారు.
ఆర్డీటీ సేవలు కేవలం ఒక రంగానికి పరిమితం కాలేదు. అనంతపురం జిల్లా రూపురేఖలను మార్చడంలో ఈ సంస్థ పాత్ర అసాధారణం అని చెప్పొచ్చు. బత్తలపల్లి, కణేకల్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తాయి. ముఖ్యంగా హెచ్ఐవీ బాధితులకు, గర్భిణీలకు ఈ ఆసుపత్రులు ఎంతో సేవ చేస్తున్నాయి. వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు వసతి, ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తోంది. నిరుపేద పిల్లలకు విదేశీ విద్య సైతం అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో వేలాది పక్కా ఇళ్లు, చెక్ డ్యామ్ల నిర్మాణం ద్వారా వ్యవసాయానికి ప్రాణం పోసింది. అనంతపురంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ గ్రౌండ్, క్రీడా అకాడమీలను నెలకొల్పి గ్రామీణ క్రీడాకారులను గ్లోబల్ వేదికలపై నిలబెట్టింది.
ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరణ సామాజిక విజయం అని చెప్పొచ్చు. లైసెన్స్ పునరుద్ధరణ కాకపోతే సంస్థ మూతపడే ప్రమాదం ఉందని భావించిన తరుణంలో, ఈ వార్త లక్షలాది మంది లబ్ధిదారులకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా లోకేశ్ చొరవ ఆహ్వానించదగినది. అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు తేవడమే కాదని, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవస్థలను కాపాడటం కూడా అని ఆయన నిరూపించే ప్రయత్నం చేశారు. కేంద్రం నిర్ణయంతో ఆర్డీటీ ప్రస్థానం నిరంతరాయంగా సాగనుంది. మాంచో ఫెర్రర్ నేతృత్వంలోని బృందానికి ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి








