CBN – Pawan: చంద్రబాబు, పవన్ సుదీర్ఘ భేటి.. పొలిటికల్ రోడ్ మ్యాప్ రెడీ..?
అమరావతి పొలిటికల్ కారిడార్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చ గురించే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాదాపు రెండున్నర గంటల సేపు సమావేశమయ్యారు. ఈ భేటీ కేవలం పైపైన కనిపిస్తున్న రాజకీయ సమీకరణాల కోసం జరిగింది కాదని చెప్పొచ్చు. ఇది కూటమి లోపల ఉన్న అంతర్గత భయాలను తొలగించి, వెలుపల ఉన్న శత్రువును దెబ్బకొట్టేందుకు సిద్ధం చేసిన ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు.
ఈ భేటీలో అత్యంత కీలకంగా చర్చకు వచ్చిన అంశం ద్వితీయ శ్రేణి నాయకత్వ సమన్వయం. పై స్థాయిలో చంద్రబాబు, పవన్ ఎంత సన్నిహితంగా ఉన్నా, గ్రామ స్థాయిలో టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య ఇప్పటికీ కొన్ని పాత కక్షలు, ఆధిపత్య పోరాటాలు కొనసాగుతున్నాయి. దీనిని వైసీపీ తన లాభానికి వాడుకుంటోందని ఇరువురు నేతలు విశ్లేషించారు. అందుకే, కేవలం నామినేటెడ్ పదవులు ఇవ్వడమే కాకుండా, ఆ పదవుల్లో ఒక పార్టీ వారు ఉంటే, వారికి సహకరించే కమిటీల్లో రెండో పార్టీ వారికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక మ్యూచువల్ పవర్ షేరింగ్ ఫార్ములాను రూపొందించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు తగ్గి, ఉమ్మడి శత్రువుపై పోరాడే శక్తి పెరుగుతుందని వారు భావిస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దాడులు, ముఖ్యంగా వ్యక్తిత్వ హననం (Character Assassination)పై పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కంటే, వైసీపీ సృష్టిస్తున్న వివాదాలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయని, దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ యంత్రాంగం కూడా సమర్థవంతంగా పనిచేయాలని నిర్ణయించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న చందంగా, కూటమి తరపున ఒక ‘కంబైన్డ్ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేయబోతున్నారు. తిరుమల లడ్డూ వంటి సున్నితమైన అంశాల్లో వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టడమే కాకుండా, ఆ పార్టీ ఉనికిని దెబ్బతీసేలా బలమైన కౌంటర్ నెరేటివ్ ను సిద్ధం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఢిల్లీ లెక్కలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. కూటమి బలంగా ఉండాలంటే కేంద్రంలో కూడా తమ గొంతుక బలంగా వినిపించాలని, అందుకే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్ఠానంతో కూడా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. జనసేనకు ఒక స్థానం ఇవ్వడం ద్వారా ఆ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపునివ్వాలని, తద్వారా పవన్ కల్యాణ్ స్థాయిని మరింత పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సీటు పంపకం కాదు, పవన్‌కు చంద్రబాబు ఇస్తున్న రాజకీయ గౌరవం’ రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.
అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలన్నా ఈ కూటమి కనీసం 15 ఏళ్లు అధికారంలో ఉండాలని, అందుకు ఇప్పటి నుంచే పునాదులు వేయాలని నిర్ణయించుకోవడం ఈ భేటీ హైలైట్. ప్రతి ఎన్నికలకూ వ్యూహాలు మార్చుకోవడం కాకుండా, ఒకే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే పొత్తును కొనసాగించి వైసీపీని నామరూపాలు లేకుండా చేయడమే ఈ అమరావతి డిక్లరేషన్ సారాంశం. మొత్తానికి, చంద్రబాబు అనుభవం – పవన్ కల్యాణ్ ఆవేశం కలిసి ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని, విపక్షాలకు అందనంత దూరాన్ని సృష్టించబోతున్నాయి.






