Vijayawada: అభివృద్ధి, సంక్షేమమే మా షడ్రుచులు: ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
Chandrababu Naid: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే మానవ జీవితంలో కష్టసుఖాలు సహజమని, పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పంచాంగ శ్రవణం – భవిష్యత్ వాణి: ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేస్తూ.. ఈ ఏడాది రాష్ట్రానికి అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని, కూటమి ప్రభుత్వానికి కాలం అనుకూలంగా ఉందని ఆయన వివరించారు.
ప్రతిభకు పట్టాభిషేకం: వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ప్రభుత్వం గౌరవించుకుంది. మొత్తం 38 మందికి ‘కళారత్న’ పురస్కారాలు, మరో 122 మందికి ఉగాది విశిష్ట పురస్కారాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు.
పేదల సంక్షేమానికి తొలి సంతకం: ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్య బాధితులకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఫైల్‌పై ఆయన తన తొలి సంతకం చేశారు. దీని ద్వారా 6,787 మంది లబ్ధిదారులకు రూ. 55.63 కోట్ల నిధులను విడుదల చేశారు.
అభివృద్ధిపై హామీ: సంపద కొందరికే పరిమితం కాకూడదని, అందరూ ఆనందంగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, నీటి భద్రత , ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. తన హయాంలో మూడోసారి గోదావరి, కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
ప్రముఖుల హాజరు:
ఈ వేడుకల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించిన అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు.







