Kannababu: కన్నబాబు బదిలీ వెనుక కాంట్రాక్టర్లు..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఈ పనులు ఇదే వేగంతో కొనసాగాలని, 2029 ఎన్నికల నాటికి అమరావతి పూర్తి చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు (Kannababu)బదిలీ కావడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన, కేవలం 14 నెలల కాలంలోనే బదిలీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతకుముందు ఉన్న కాటమనేని భాస్కర్ కూడా కేవలం 7-8 నెలలు మాత్రమే పనిచేశారు. అమరావతి వంటి భారీ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇలా తరచుగా కమిషనర్లను మార్చడం వల్ల పనుల వేగంపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కన్నబాబు బదిలీ వెనుక అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు. అయితే ఆయన బదిలీకి అనేక కారణాలున్నాయని అమరావతి వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగాకన్నబాబు అమరావతి పనులను పర్యవేక్షించడానికి ఒక ‘డాష్ బోర్డు’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏ కాంట్రాక్టర్ ఎంత శాతం పని పూర్తి చేశారో స్పష్టంగా తెలిసేది. కొంతమంది కాంట్రాక్టర్లు కేవలం 5 నుంచి 20శాతం మాత్రమే పనులు పూర్తి చేసినట్లు ఇందులో తేలింది. ఈ పారదర్శకత వల్ల ఇబ్బంది పడ్డ కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని సమాచారం.
ఇవి కూడా చదవండి
కన్నబాబు ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్వేర్ విధానం వల్ల కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతోందని, దీనిపై వారు సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మాజీ సీఎస్ ఒకరు కొందరు ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన రహస్య సమావేశానికి కన్నబాబు హాజరయ్యారనే రూమర్ కూడా ఉంది, అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలీదు. ప్రారంభంలో ఆయనపై రైతుల సమస్యల పట్ల అవగాహన లేదనే విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత ఆయన చాలా సమస్యలను పరిష్కరించారు. అయినా ఆయన బదిలీ కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
అమరావతి నిర్మాణం అంటే కేవలం రోడ్లు, బిల్డింగ్లే కాదు.. ఇందులో భూ సమీకరణ, పర్యావరణ అంశాలు, టెక్నికల్ ఇష్యూస్ వంటి ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. కన్నబాబు స్థానంలో విజయరామరాజు నియమితులయ్యారు. ఆయన ఎంత సమర్థుడైనప్పటికీ, ఇంతటి సంక్లిష్టమైన ప్రాజెక్టుపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చు. ఇది పనుల పురోగతిని మందగించేలా చేసే అవకాశం ఉంది. ఒక కీలకమైన ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 3-4 ఏళ్ల పాటు ఒకే కమిషనర్‌ను కొనసాగిస్తే బాగుంటుంది. ఇలా తరచూ మార్పులు చేయడం వల్ల ప్రాజెక్టు లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి








