మెటా సోషల్ మీడియాపై అమెరికాలో పోరాటం.. 29 రాష్ట్రాల దావా..!
సోషల్ మీడియా దిగ్గజం మెటా పీకల్లోతు చిక్కుల్లో పడింది. ఆసంస్థపై ఏకంగా 29 రాష్ట్రాలు ఉమ్మడిగా ఓక్ లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి. తమ సోషల్ మీడియా యాప్ లతో చిన్నపిల్లలు, టీనేజర్లను వ్యసనపరులుగా మారుస్తోందని ఆరోపించాయి. దీన్ని మెటా బానిసత్వంపై పోరుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అమెరికాలో రెండో ‘బిగ్ టొబాకో’ మూమెంట్ అంటున్నారు.
యూజర్లు వీలైనంత అధిక సమయం యాప్‌ల్లో గడిపేలా చేయడం, వారి వ్యక్తిగత సమాచారం సేకరించడం, వాస్తవాలను దాచి పెట్టడమే దాని బిజినెస్ మోడల్ అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ ఆరోపించారు. యువతను అడిక్ట్ చేస్తే.. దీర్ఘకాలం వారు వీటిపై సమయం వెచ్చించడంతో భారీగా లాభాలు సంపాదించే అవకాశం మెటాకు లభిస్తుందని ఆమె వాదించారు. తల్లిదండ్రుల అనుమతులు లేకుండా పిల్లల డేటాను సేకరించి.. వారిని ఆకర్షించే వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయడం అమెరికా చట్టాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
అన్లిమిటెడ్ స్క్రోలింగ్‌తో వారి సమయం.. లైక్ బటన్‌తో వారిలో ఆత్మవిశ్వాసం, యాంగ్జైటీ, డిప్రెషన్, తమకు తాము హాని చేసుకునే ఆలోచనలను పెంచడం.. పుష్ నోటిఫ్కేషన్లతో యాప్‌ను చూడకపోతే ఏదో కోల్పోతున్నామనే భావన కలిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌ను ఆ కంపెనీ ఉద్యోగులు ఓ మాదకద్రవ్యంతో పోల్చిన చాట్లను చూపించారు. ఎంత చిన్న వయసులో పిల్లలు యాప్‌ను వాడటం మొదలుపెడితే.. అంత సంపాదించొచ్చని మెటా ముందుగానే గుర్తించిందని మేగన్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఫేస్బుక్ (facebook) మాజీ డేటా సైంటిస్ట్ ఫ్రాన్సిస్ హ్యూజన్ ప్రజావేగుగా మారడంతో విషయాలు మొత్తం బయటకు వచ్చి ఈ కేసుకు పునాది పడింది. యువత ఆరోగ్యంపై తమ యాప్‌లు ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తెలిసి కూడా.. మెటా వాటిని తీసుకొచ్చిందని ఫ్రాన్సిస్ 2021 సెనెట్ విచారణలో వెల్లడించాడు.
మెటా వాదనలు.
మరోవైపు మెటా మాత్రం దీనిని ఖండించింది. కేవలం అటార్నీ జనరల్స్ పరిహారాల వసూలు కోసమే ఈ దావా వేసినట్లు పేర్కొంది. మెటా అధిపతి జుకర్‌బెర్గ్ ఫేస్బుక్, ఇన్‌స్టాలో పిల్లలను రక్షించేందుకు చాలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. వాస్తవాలు, చట్టలకు అనుగుణంగా కాకుండా.. అసాధారణ స్థాయిలో పరిహారాలపై రాష్ట్రాలు దృష్టిపెట్టాయని చెప్పింది. ఈ విచారణ ఆరు వారాల పాటు జరిగే అవకాశం ఉంది. న్యాయమూర్తి ఎదుటకు జుకర్‌బర్గ్, ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మస్సోరీని పిలిపించే అవకాశం ఉంది.
మరోవైపు కాలిఫోర్నియా ఏజీ మేగన్ మాట్లాడుతూ ఈ కేసు మెటా ఓడిపోతే 200 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి రావొచ్చని పేర్కొన్నారు. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.19 లక్షల కోట్లకు పైగా ఉంటుంది.








