AI Impact Summit: సంచలనం.. ఏఐ సమ్మిట్ వేదికగా చొక్కాలు విప్పి నిరసన

AI Impact Summi: దేశ రాజధానిలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026‘లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు హాజరైన ఈ వేదిక వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు ఆకస్మికంగా నిరసన చేపట్టడం కలకలం రేపింది.
కార్పొరేట్ శక్తులకు అనుకూలమంటూ ఆరోపణలు:
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలొగ్గుతోందని నిరసనకారులు ఆరోపించారు. విదేశీ విధానాల విషయంలో దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, కీలక రంగాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శిస్తూ నినాదాలు చేశారు. “దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు” అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
తీవ్ర నిరసన – అర్ధనగ్న ప్రదర్శన:
నిరసన ఉధృతం కావడంతో, కొందరు కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్న సమయంలో ఈ తరహా నిరసన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకునే వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భద్రతా వైఫల్యంపై ఆందోళన:
ప్రధాని మోడీతో పాటు పలువురు అంతర్జాతీయ వీవీఐపీలు హాజరైన ఈ సదస్సు వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ, నిరసనకారులు వేదిక సమీపానికి ఎలా చేరుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన భద్రతా సంస్థలు, ప్రవేశ మార్గాల వద్ద నిఘాను మరింత కఠినతరం చేశాయి.
అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ నిరసన ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తుండగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ గళాన్ని వినిపించడమే తమ ఉద్దేశమని యూత్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.











































































