Supreme Court: ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఫ్రీ విద్యుత్ హామీపై ప్రశ్నలు

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఉచిత పథకాల సంస్కృతిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల వేటలో భాగంగా ఎన్నికలకు ముందు ఇష్టానుసారంగా ఉచిత పథకాలను ప్రకటించడం దేశాభివృద్ధికి పెను ముప్పుగా పరిణమించిందని ధర్మాసనం హెచ్చరించింది. తమిళనాడు ఎన్నికల సమయంలో డీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించిన ఉచిత విద్యుత్ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఇటువంటి ఉచితాలు ప్రకటించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
అందరికీ ఉచితమా?
తమిళనాడులో వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. “సంక్షేమ పథకాల్లో భాగంగా కనీస ఛార్జీలు చెల్లించలేని పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే అర్థముంది. కానీ ధనిక-పేద అనే తేడా లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలనుకోవడం కేవలం బుజ్జగింపు రాజకీయం కాదా?” అని నిలదీశారు.
రాష్ట్రాల ఆదాయ లోటుపై ఆందోళన:
మెజారిటీ రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు భయంకరంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు ఉచిత పథకాల పంపిణీని ఆపకపోవడంపై ధర్మాసనం (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఆహారం, విద్యుత్, సైకిళ్లు.. ఇలా ప్రతిదీ ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం సమాజంలో ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం? ఎన్నికల ముందే ఇలాంటి వరాల జల్లు కురిపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?” అని కోర్టు ప్రశ్నించింది. ఒకసారి విద్యుత్ టారిఫ్లను నోటిఫై చేసిన తర్వాత, హఠాత్తుగా ఉచితాల ప్రకటనలు చేయడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అభివృద్ధి కుంటుపడుతోంది:
రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాలోని నిధులను ఇలా ఉచిత పథకాలకు తగలేస్తే, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా కూడా మిగలదని సుప్రీంకోర్టు (Supreme Court) హెచ్చరించింది. ఇది కేవలం ఒక్క తమిళనాడుకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులుగా మార్చే కన్నా, ఉపాధి అవకాశాలను సృష్టించడంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని ధర్మాసనం సూచించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఇటువంటి విధానాలపై జాతీయ స్థాయిలో పునఃసమీక్ష జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
చివరగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఉచిత పథకాల నియంత్రణకు సంబంధించి కేంద్రం వైఖరి ఏంటో తెలపాలని ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టే ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు సంక్షోభం తప్పదని న్యాయ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.











































































