Iran-US: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. ట్రంప్ హెచ్చరికలు!

పశ్చిమాసియా (Iran-US) రాజకీయ పటంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతున్న వేళ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ తమతో ఒక “అర్థవంతమైన ఒప్పందం” (Meaningful Deal) చేసుకోవాలని, లేనిపక్షంలో ఊహించని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరుదేశాల మధ్య అణు ఒప్పందంపై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలోనే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
చర్చలు లేదంటే దాడులు: ట్రంప్
వాషింగ్టన్ వేదికగా జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ తొలి సమావేశంలో ట్రంప్ (Donald Trump) తన విదేశీ విధానాన్ని కుండబద్దలు కొట్టినట్లు వివరించారు. “ఇరాన్‌తో మంచి డీల్ చేసుకోవడం అంత సులభం కాదని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు మాకు ఒక మంచి ఒప్పందం కావాలి. మేం (Iran-US) చర్చలకే ప్రాధాన్యత ఇస్తాం, కానీ కేవలం చర్చలకే పరిమితం అవ్వబోం. ఇరాన్ శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే చాలా దారుణాలు జరుగుతాయి” అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే.. ఇరాన్ తమ షరతులకు లొంగకపోతే సైనిక చర్య తప్పదనే సంకేతాలను ఆయన స్పష్టంగా పంపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చుట్టుముట్టిన అమెరికా దళాలు:
ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో అమెరికా సైన్యం ఇరాన్‌ను (Iran-US) నాలుగు వైపులా చుట్టుముట్టేలా మోహరింపులు చేపట్టింది. ఇప్పటికే అమెరికాకు చెందిన శక్తివంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ ఇరాన్ తీరానికి చేరువలో తిష్ట వేసింది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా పేరుగాంచిన ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ కూడా ఇరాన్ దిశగా ప్రయాణిస్తోంది. గగనతలంలో కూడా అమెరికా (Iran-US) తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. జోర్డాన్‌లోని మువాఫక్ సాల్టీ బేస్, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లకు డజన్ల కొద్దీ అమెరికా యుద్ధ విమానాలు చేరుకున్నాయి. ఇందులో అత్యంత అధునాతనమైన ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఎఫ్-22 రాప్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. నిఘా కోసం ఈ-3 ఎయిర్‌బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ కోసం ఈ-11 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా అమెరికా రంగంలోకి దింపింది.
మరోవైపు అమెరికా కదలికలను ఇరాన్ కూడా నిశితంగా గమనిస్తోంది. అమెరికా యుద్ధనౌకలను క్షణాల్లో ముంచేసే శక్తివంతమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని ఇరాన్ (Iran-US) సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఇటీవలే హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను అమెరికా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏ క్షణమైనా ఇరాన్‌పై మెరుపు దాడులు చేసి ఖమేనీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా మిలిటరీ దళాలు ఇప్పటికే ‘రెడీ’ పొజిషన్లో ఉన్నాయని, వైట్ హౌస్ నుంచి ఆదేశాలు అందిన వెంటనే దాడులు మొదలవుతాయని సమాచారం. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే, ప్రపంచం మరో భారీ యుద్ధాన్ని చూడబోతుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.











































































