Dharmapuri Aravind: సొంత పార్టీ నేతలపై ఎంపీ సంచలన కామెంట్స్

తెలంగాణా(Telangana)లో భారతీయ జనతా పార్టీ(BJP) బలోపేతం కావాలని ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణాలో ఆ పార్టీకి చాలా మెరుగైన అవకాశాలు ఉన్న మాట వాస్తవం. రాజకీయంగా పార్టీకి కావాల్సిన వనరులు కూడా తెలంగాణా ప్రాంతంలో ఉన్నాయి. హిందూ మత ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీకి బలంగా ఉంది. కానీ నాయకత్వం మాత్రం సమర్ధవంతంగా లేదనే విమర్శలు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీ తెలంగాణాలో ఎన్నో ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం.
కాని నేటికి కూడా ఆ పార్టీ సరైన బలాన్ని సాధించలేదు. 2023 అసెంబ్లీ, మరుసటి ఏడాది అంటే 24 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటింది. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీ ప్రభావం చూపడం లేదనే విమర్శలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. క్రమంగా పార్టీ నాయకత్వం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా లోకల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేసారు.
బీజేపీ కోవర్టులపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్నవారు వెళ్లిపోవాలని కోరారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడిందని, దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కవిత(Kavitha) వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా అని నిలదీశారు. నిజామాబాద్లో బీఆర్ఎస్(BRS) కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని వ్యాఖ్యానించారు.










































































