Visa: బంగ్లాదేశ్ వీసాలకు కేంద్రం రెడీ..?

గత రెండేళ్లుగా భారత్ – బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికలతో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడటం, అక్కడి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశం ఉండటంతో కీలక పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో బంగ్లాదేశ్‌లోని ఒక ఉన్నత భారత దౌత్యవేత్త వీసా సేవల(Visa Services) పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.
రెండు దేశాల మధ్య వీసాలను త్వరలో పునరుద్ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. అన్ని వీసా సేవలను పూర్తిగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సిల్హెట్ లోని భారత(India) సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ చెప్పారని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మెడికల్(Medical Visa), డబుల్-ఎంట్రీ వీసాలు ఇప్పుడు జారీ చేస్తున్నామని తెలిపారు. ట్రావెల్ వీసాలతో సహా ఇతర వీసాలను తిరిగి ప్రారంభించడానికి చర్యలు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
2024 జూలై-ఆగస్టు ఆందోళనల తర్వాత భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీని ఫలితంగా అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. అక్కడి నుంచి వీసాల విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది. 2009లో హసీనా ప్రధానమంత్రి అయినప్పటి నుండి, బంగ్లాదేశ్ తో భారత్ కు అత్యుత్తమ ద్వైపాక్షిక సంబంధాలు ఉండేవి. ఇక ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఈ సంబంధాలు మరింత దిగజారాయి. యూనస్ పాలనలో భారత్ పై దాడి చేసినవారు, భారత వ్యతిరేక రాడికల్స్ జైళ్ల నుండి విడుదలయ్యారు.
ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. డిసెంబర్ 17, 2025 నుండి బంగ్లాదేశ్ లో వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఢాకాలోని ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని మూసివేసింది కేంద్రం. ఫిబ్రవరి 12 ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చీఫ్ తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రి కావడంతో , సుదీర్ఘ చరిత్ర కలిగిన రెండు దేశాల సంబంధాలను చక్కదిద్దేందుకు రెండు వైపుల ప్రభుత్వాలు కృషి చేసే సంకేతాలు కనపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి










































































