Tirumala: శాసనమండలిలో నెయ్యి సెగ.. దేవుడి ఫొటోలతో వైసీపీ ‘డ్రామా..

AP: అమరావతి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచే ‘హెరిటేజ్-ఇందాపూర్‘ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యులు అకస్మాత్తుగా వేంకటేశ్వరస్వామి ఫొటోలను సభలోకి తీసుకురావడం సంచలనం సృష్టించింది.
వైసీపీ సభ్యుల తీరుపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ చర్యపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని సభలోకి లాగడం అత్యంత దురదృష్టకరమని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనగా తన హెడ్‌ఫోన్‌ను టేబుల్‌కేసి బలంగా కొట్టారు.

సభలో ఇరు పక్షాల మధ్య చోటుచేసుకున్న వాదోపవాదాలు, ని నాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పయ్యావుల తీరును వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు కూడా గళం విప్పడంతో సభ నియంత్రణ తప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మండలి ఛైర్మన్ ప్రయత్నించినప్పటికీ, సభ సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో సమావేశాన్ని 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమల నెయ్యి నాణ్యత, హెరిటేజ్ సంస్థ ప్రస్తావన చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
ఇవి కూడా చదవండి










































































