Ranji Trophy: 66 ఏళ్ల చరిత్రలో తొలిసారి రంజీ ఫైనల్లో జమ్ముకశ్మీర్!

దేశవాళీ క్రికెట్ చరిత్రలో పెను సంచలనం నమోదైంది. రంజీ ట్రోఫీ (Ranji Trophy) డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ, గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన కేరళ జట్లు ఈసారి కనీసం గ్రూప్ దశను కూడా దాటలేక ఇంటిముఖం పట్టాయి. ముంబయి, దిల్లీ, తమిళనాడు, బరోడా లాంటి ఎన్నో అగ్రశ్రేణి జట్లు సెమీస్ చేరడంలో కూడా దారుణంగా విఫలమయ్యాయి. కానీ బరిలోకి దిగినప్పుడు ఎలాంటి అంచనాలు లేని, దేశవాళీ టోర్నీల్లో ఎప్పుడూ ఒక ‘పసికూన’గా పరిగణించే జమ్ముకశ్మీర్ జట్టు మాత్రం అద్భుతమైన ఆటతీరుతో చరిత్ర సృష్టించింది. తమ 66 ఏళ్ల రంజీ ట్రోఫీ (Ranji Trophy) ప్రయాణంలో మొట్టమొదటిసారిగా ఆ జట్టు ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. ఫిబ్రవరి 24న జరగనున్న ప్రతిష్టాత్మక తుది పోరులో బలమైన కర్ణాటక జట్టుతో జమ్ముకశ్మీర్ అమీతుమీ తేల్చుకోనుంది.
కష్టాల కడలి నుంచి అద్భుత తీరానికి:
జమ్ముకశ్మీర్ జట్టు సాధించిన ఈ ఘనత వెనుక ఎన్నో కన్నీటి గాథలు, పోరాటాలు దాగి ఉన్నాయి. దశాబ్దాలుగా తీవ్రవాద ఘటనలు, అశాంతి, బాంబుల మోతతో దద్దరిల్లే ఆ రాష్ట్రంలో క్రీడలకు, ముఖ్యంగా ప్రశాంతంగా ఆడుకునే క్రికెట్‌కు సరైన వసతులు లేవు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికే కుర్రాళ్లు క్రికెట్‌ను ఒక కెరీర్‌గా ఎంచుకోవడమే చాలా అరుదైన విషయం. భౌగోళికంగా ఎగుడుదిగుడుగా ఉండే ఆ ప్రాంతంలో సరైన క్రికెట్ మైదానాలు లేకపోయినా వారు ఏళ్ల తరబడి రంజీల్లో నామమాత్రంగా బరిలోకి దిగుతూ వచ్చారు. 1959-60లో తొలిసారి రంజీ ట్రోఫీలో (Ranji Trophy) అడుగుపెట్టిన ఆ జట్టుకు తమ తొలి విజయం నమోదు చేయడానికి ఏకంగా 23 ఏళ్లు పట్టిందంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2001-02లో తొలిసారి నాకౌట్ చేరిన ఈ టీం.. మళ్లీ 2015-16 సీజన్లో పర్వేజ్ రసూల్ నాయకత్వంలో బలమైన ముంబయిపై గెలిచి సంచలనం సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సీజన్లో ఏకంగా ఫైనల్ చేరి దేశం మొత్తం తమ వైపు చూసేలా చేశారు.
దిగ్గజాలను మట్టికరిపించి..
ఈ (Ranji Trophy) సీజన్లో గ్రూప్-డిలో ముంబయి తర్వాత రెండో స్థానంలో నిలిచిన జమ్ముకశ్మీర్ నాకౌట్‌కు దూసుకొచ్చింది. క్వార్టర్స్‌లో బలమైన మధ్యప్రదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక సెమీ ఫైనల్ పోరులో ఏకంగా బెంగాల్‌పై 6 వికెట్ల తేడాతో సాధికార విజయం సాధించింది. మహ్మద్ షమి, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్టార్ ఆటగాళ్లు ఉన్న బెంగాల్‌ను ఓడించడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల ఆధిక్యం కోల్పోయినప్పటికీ, బెంగాల్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం లభించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్ముకశ్మీర్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.
విజయ సారథులు వీరే..
ఈ అద్భుత ప్రయాణంలో కశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబి పాత్ర అత్యంత కీలకం. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 12.72 సగటుతో ఏకంగా 55 వికెట్లు పడగొట్టి, టోర్నీలో (Ranji Trophy) అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. బెంగాల్‌తో జరిగిన సెమీస్‌లో 9 వికెట్లు తీయడంతో పాటు 42 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అవార్డు అందుకున్నాడు. ఈ మెరుపు ప్రదర్శనతోనే ఐపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్ అతన్ని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే జమ్ముకశ్మీర్ స్టార్ బ్యాటర్ అబ్దుల్ సమద్ 9 మ్యాచ్‌ల్లో 59.54 సగటుతో 655 పరుగులు (1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు) సాధించి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 551 పరుగులతో జట్టును ముందుండి నడిపించగా.. బౌలర్లు సునీల్ కుమార్ (29 వికెట్లు), అబిద్ ముస్తాక్ (20 వికెట్లు), యుధ్వీర్ సింగ్ (19 వికెట్లు) అద్భుతంగా రాణించారు.
కోచ్ అజయ్ శర్మ సమష్టి మంత్రం:
ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలకు తోడు కోచ్ అజయ్ శర్మ కల్పించిన సమష్టితత్వం వల్లే జమ్ముకశ్మీర్ ఈ స్థాయికి చేరిందని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు దిల్లీ జట్టు కెప్టెన్‌గా, టీమిండియా ఆటగాడిగా ఉన్న అజయ్ శర్మ.. 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొన్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ నిషేధం తొలగిపోయినప్పటికీ, అతనిపై పడ్డ మచ్చ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఒక అద్భుతమైన కోచ్‌గా తన వ్యూహాలతో జమ్ముకశ్మీర్‌ను రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఫైనల్‌కు చేర్చి ఆ మచ్చను చెరిపేసుకున్నాడు. మరి అజయ్ శిక్షణలో జమ్ముకశ్మీర్ తుది పోరులో కర్ణాటకను కూడా ఓడించి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుని సువర్ణాధ్యాయం లిఖిస్తుందేమో వేచి చూడాలి.











































































