T20 World Cup: టి20 వరల్డ్ కప్ లో ఆ ఆటగాడికి తీరని అన్యాయం..?

క్రికెట్ సహా ఏ క్రీడల్లో అయినా సరే తుది జట్టులో సత్తా ఉన్న ఆటగాడికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. తుది జట్టులో తీసుకున్నా సరే సరైన స్థానంలో ఆడించాలి. లేదంటే అతను జట్టులో ఉన్నా సరే అది పెద్దగా లెక్క ఉండదు. ఈ విషయాన్ని టీం ఇండియా(Team India) యాజమాన్యం మర్చిపోతుంది అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్(Washington Sundar) విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని క్రికెట్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఫార్మాట్ల ఆటగాడు అయినా సరే అతనికి విలువ లేదు అంటూ మండిపడుతున్నారు.
టెస్ట్ క్రికెట్ లో మూడవ స్థానంలో ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు అతను. అయినా సరే లోయర్ ఆర్డర్ లో ఆడిస్తూ టాలెంట్ నాశనం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక వన్డే ఫార్మాట్ లో కూడా నాల్గవ స్థానంలో లేదా 5 వ స్థానంలో ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అయినా సరే అతనిని పక్కన పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా జరుగుతోన్న టి20 వరల్డ్ కప్ విషయంలో కూడా అతనికి అన్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని సరిగా వాడుకోవడం లేదని మండిపడుతున్నారు.
అక్షర్ పటేల్ స్థానంలో అతను జట్టులోకి వచ్చాడు. కానీ నిన్న కనీసం అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించలేదు. ఇక అతన్ని లోయర్ ఆర్డర్ లో ఉంచడంపై కూడా విమర్శలు ఉన్నాయి. టాప్ ఆర్డర్ లో ఆడే సత్తా ఉన్నప్పటికీ అతనికి ఆ స్థాయిలో ప్రయారిటీ దక్కడం లేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. స్పిన్ బౌలింగ్ లో కూడా మంచి టెక్నిక్ ఉన్నా, ఫీల్డింగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉన్నా సరే.. ఏ కోణంలో కూడా అతనికి అవకాశాలు సరిగా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.











































































