Jobs: వచ్చే 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు పోతాయి: ఆండ్రూ యాంగ్

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) సాంకేతికత అనూహ్య వేగంతో విస్తరిస్తున్న కొద్దీ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో (Jobs) భయాందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఏఐ రాకతో తమ ఉద్యోగాలు ఎక్కడ ప్రమాదంలో పడతాయో అని వివిధ రంగాల నిపుణులు ఆందోళన చెందుతున్న తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రూ యాంగ్ (Andrew Yang) చేసిన తాజా వ్యాఖ్యలు ఈ భయాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఏఐ కారణంగా లక్షలాది ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆయన జోస్యం చెప్పారు.
ప్రమాదంలో వైట్ కాలర్ జాబ్స్:
ముఖ్యంగా ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే ‘వైట్ కాలర్’ (White-collar) ఉద్యోగులపై కృత్రిమ మేధ ప్రభావం అత్యంత దారుణంగా ఉండబోతోందని యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు. ఆయన అంచనా ప్రకారం, భారీ సంఖ్యలో గల్లంతయ్యే ఉద్యోగాల్లో (Jobs) ప్రధానంగా సాఫ్ట్వేర్ కోడర్స్, ప్రకటనల విభాగంలో పనిచేసే మార్కెటింగ్ సిబ్బంది, ఆఫీసుల్లోని మిడిల్ మేనేజర్లు, కస్టమర్లకు సేవలందించే కాల్ సెంటర్ సిబ్బంది అత్యధికంగా నష్టపోనున్నారు. ఈ విభాగాల్లో పనిచేస్తున్న వారు రానున్న గడ్డు కాలానికి మానసికంగా, వృత్తిపరంగా ముందుగానే సిద్ధమై ఉండాలని ఆయన గట్టిగా సూచించారు.
కార్పొరేట్ సంస్థల మధ్య కోతల పోటీ:
ఆండ్రూ యాంగ్ (Andrew Yang) కేవలం ఉద్యోగాలు పోతాయని చెప్పడమే కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో చోటుచేసుకోబోయే ఒక ప్రమాదకరమైన ధోరణిని కూడా వివరించారు. ఒకవేళ ఏదైనా ఒక సంస్థ కృత్రిమ మేధను ఉపయోగించి తమ సిబ్బంది సంఖ్యలో కోత విధించడం మొదలుపెడితే, మార్కెట్లోని వారి ప్రత్యర్థి సంస్థలు కూడా కచ్చితంగా అదే బాట పట్టాల్సిన ఒత్తిడి తలెత్తుతుందని ఆయన విశ్లేషించారు. దీనికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్ స్పందనే. ఏ కంపెనీ అయితే తమ ఉద్యోగుల (Jobs) సంఖ్యను తగ్గించుకుని, నిర్వహణ వ్యయాన్ని అదుపులోకి తెస్తుందో, ఆ కంపెనీ పట్ల స్టాక్ మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. సిబ్బందిని తగ్గించుకోని సంస్థల పట్ల మార్కెట్ భిన్నంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల కంపెనీల మధ్య ఉద్యోగుల తొలగింపు అనేది ఒక పోటీలా మారుతుందని ఆయన (Andrew Yang) అభిప్రాయపడ్డారు.

చిన్నస్థాయి ఉపాధిపై పరోక్ష దెబ్బ:
ఏఐ ప్రభావం కేవలం సాఫ్ట్వేర్ లేదా టెక్నికల్ రంగాలకే పరిమితం కాదని, దాని ప్రకంపనలు నాన్-టెక్నికల్ విభాగాలపై కూడా తీవ్రంగా పడతాయని యాంగ్ (Andrew Yang) వెల్లడించారు. సమాజంలో డ్రై క్లీనింగ్ చేసేవారు, పెంపుడు కుక్కలను వాకింగ్ తీసుకెళ్లే డాగ్ వాకర్లు, సెలూన్లలో పనిచేసే హెయిర్ స్టైలిస్టులు వంటి చిన్నస్థాయి ఉపాధి పొందుతున్న వారు ఉంటారు. టెక్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు (Jobs) చేస్తున్న వారు తమ ఉపాధిని కోల్పోతే, ఆ ఆర్థిక ప్రభావం నేరుగా ఈ చిన్నస్థాయి సేవలపై పడుతుంది. ఉద్యోగాలు పోయిన వారు తమ బట్టలను డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం మానేస్తారు, తమ పెంపుడు జంతువులను వారే స్వయంగా వాకింగ్‌కు తీసుకువెళ్తారు, బ్యూటీ పార్లర్లు లేదా సెలూన్లకు వెళ్లడం భారీగా తగ్గించేస్తారు. తద్వారా పరోక్షంగా ఈ చిన్న ఉద్యోగస్థుల ఉపాధి కూడా దెబ్బతింటుంది.
ఇంజినీర్లకు ఊరటనిచ్చే అంశాలు:
ఇదిలా ఉంటే, ఏఐ మోడల్స్ స్వయంగా కోడింగ్ రాస్తుంటే ఇక సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు పని ఏముంటుందనే తీవ్ర ఆందోళన ఐటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఏఐ నిపుణులు కొంత ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. ఇంజినీర్ల ఉద్యోగంలో (Jobs) కోడింగ్ రాయడం అనేది కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలంటే వాటికి ఖచ్చితమైన ఆదేశాలు (ప్రాంప్ట్‌లు) ఇవ్వడం, సంస్థలోని ఇతర బృందాలతో సమన్వయం చేసుకోవడం, వినియోగదారులతో నేరుగా అనుసంధానం అవ్వడం, భవిష్యత్తులో ప్రాజెక్టులోకి ఎలాంటి కొత్త ఫీచర్‌ను తీసుకురావాలి అనే కీలక అంశాలపై లోతైన రీసెర్చ్ చేయడం వంటి ఎన్నో క్లిష్టమైన పనులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు అలాగే మిగిలి ఉంటాయని ఏఐ నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి










































































