YCP: కల్తీ నెయ్యిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందా..?

తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో వైఎస్ జగన్, ఆయన సోషల్ మీడియా విభాగం అనుసరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఒక వ్యవస్థాగత లోపంగా చూడాల్సిన ఈ విషయాన్ని, జగన్ తన వ్యక్తిగత అంశంగా భావించి ఎదురుదాడికి దిగడం ద్వారా వైసీపీ మరింత ఇరకాటంలో పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని వచ్చిన ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ తరుణంలో ప్రభుత్వం, టీటీడీ వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపాల్సింది పోయి, వైసీపీ అగ్రనాయకత్వం వ్యవహరించిన తీరు ఆ పార్టీకి రాజకీయంగా ప్రతికూలంగా మారుతోంది.
కల్తీ నెయ్యి సరఫరాపై విచారణ జరిపిన అధికారుల నివేదిక ప్రకారం, సుమారు రూ.251 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు, సరఫరా అయిన నెయ్యి నాణ్యతలో భారీ లోపాలు ఉన్నట్లు తేలింది. అసలు సరఫరాదారు ఇచ్చినది నెయ్యే కాదని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్థాయిలో అవినీతి, అపచారం జరిగిందని నివేదికలు చెబుతుంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో వైసీపీ వెనకబడింది. దానికి బదులుగా, కేవలం టెక్నికల్ అంశాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆ పార్టీ వ్యూహకర్తల వైఫల్యంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
తమపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి జగన్ బృందం ‘హెరిటేజ్‘ సంస్థను వివాదంలోకి లాగింది. గతంలో హెరిటేజ్ నుంచి కూడా నెయ్యి సరఫరా జరిగిందని, చంద్రబాబు కుటుంబానికి చెందిన సంస్థ కాబట్టి ఆయన సమాధానం చెప్పాలని వైసీపీ వాదించింది. అయితే, సరైన ఆధారాలు లేకుండా చేసిన ఈ ఆరోపణలు వైసీపీకే రివర్స్ అయ్యాయి. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడం, కంటెంట్ తొలగించమని ఆదేశించడం జగన్ ఇమేజ్ను మరింత దెబ్బతీసింది. రాజకీయాల్లో ప్రత్యర్థిని దెబ్బకొట్టే క్రమంలో ఒక పారిశ్రామిక సంస్థపై ఆధారాల్లేకుండా విమర్శలు చేయడం వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువని తాజా పరిణామాలు నిరూపించాయి.
టీటీడీ అనేది ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. నెయ్యి కొనుగోలులో లోపాలు జరిగితే అది అధికారుల లేదా సరఫరాదారుల తప్పు అవుతుంది. కానీ జగన్ దీనిని నేరుగా తనపై జరిగిన దాడిగా భావించి డిఫెన్స్‌లోకి వెళ్లారు. ఇది ప్రజల్లో “ఏదో తప్పు జరిగింది కాబట్టే ఇంతలా స్పందిస్తున్నారు” అనే సందేహాన్ని కలిగించింది. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, ఆయన భక్తులకు క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేయడం విడ్డూరంగా అనిపించింది. కల్తీ జరిగిందని రిపోర్టులు చెబుతుంటే, నిజాన్ని బయటపెట్టిన వారిని క్షమాపణ కోరడం వల్ల వైసీపీ వైఖరిపై విమర్శలు పెరిగాయి. తిరుమల అంశం భక్తితో ముడిపడి ఉన్నది. దీనిని కేవలం రాజకీయ కోణంలో, టెక్నికల్ పాయింట్లతో సమర్థించుకోవాలని చూడడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జగన్ అనుసరించిన తీరు ‘రియాక్టివ్’ గా ఉందే తప్ప ‘ప్రోయాక్టివ్’ గా లేదు. వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరాల్సిన నాయకుడి స్థానంలో ఉండి, తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయడం వల్ల ఆయన మరింత వివాదాల్లో చిక్కుకున్నారు. చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూసి, తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇవి కూడా చదవండి










































































