Mangalagiri: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు.. కత్తితో కసా.. కసా..

Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడి గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నారనే చిన్న కారణంతో భార్య తన భర్తను కత్తితో పొడిచి ప్రాణాలు తీసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. క్రాంతికి గతంలోనే వేరొకరితో వివాహం జరగగా, ఆమె మొదటి భర్త ఒక నేరం కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అహ్మద్, క్రాంతి ఇద్దరూ రెండో వివాహం చేసుకుని పెదవడ్లపూడిలో నివాసం ఉంటున్నారు.
గురువారం ఇంట్లో క్రాంతి టీవీ చూస్తుండగా, సౌండ్ ఎక్కువగా ఉండటంతో అహ్మద్ ఆమెను సౌండ్ తగ్గించమని కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన క్రాంతి, ఇంట్లోని కత్తితో అహ్మద్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అహ్మద్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గాయాలు బలంగా తగలడంతో ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మార్గమధ్యలో మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి గొడవ చివరకు ప్రాణాల మీదకు తీసుకురావడంతో స్థానిక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.











































































