Ranveer Singh: 10 కోట్లు ఇవ్వకపోతే లేపేస్తాం..!

గత రెండేళ్ళుగా బాలీవుడ్ హీరోలకు లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్ చుక్కలు చూపిస్తోంది. ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం.. గుజరాత్ లోని ఓ జైలులో అత్యంత భద్రత నడుమ ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచే తన నేర కార్యాకలాపాలను ఆయన విస్తరించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 చివర్లో ఎన్సీపీ(NCP) ఎమ్మెల్యే బాబా సిద్దిఖీని లారెన్స్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఆ తర్వాతి నుంచి పలువురు స్టార్ హీరోలను, నటులను లారెన్స్ గ్యాంగ్ బెదిరించింది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక నిందితుడు హ్యారీ బాక్సర్ నేతృత్వంలో లారెన్స్ గ్యాంగ్ సినిమా వాళ్ళను బెదిరిస్తోంది. శుక్రవారం ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో.. రణ్వీర్ సింగ్ నుంచి రూ.10 కోట్లు వసూలు చేసేందుకు యుఎస్ ఫోన్ నంబర్ నుండి రణవీర్ సింగ మేనేజర్ వాట్సాప్ నెంబర్ కు వాయిస్ నోట్ ఒకటి బెదిరిస్తూ పంపారు. ఈ నంబర్ గురించి మరింత సమాచారం కోసం ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అమెరికా అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నెలలో చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వెలుపల జరిగిన కాల్పులకు బాక్సర్ నేతృత్వం వహించాడు.
ఈ కేసులో మొత్తం ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రణవీర్ సింగ్ కు వచ్చిన బెదిరింపు మెసేజ్ పై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, గురువారం పోలీసు వర్గాల వివరాల ప్రకారం.. రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిపిన వారికి 50 వేల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి వెలుపల కాల్పులకు పాల్పడినందుకు కూడా లోంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా సిద్దిఖీ కేసులో కూడా అతను కీలకంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.











































































