Anthropic : యాక్సెంచర్ సంచలనం.. AI వాడకపోతే ప్రమోషన్లు కట్!

Anthropic : ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ యాక్సెంచర్ తన సీనియర్ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, కెరీర్ ఎదుగుదలకు AI నైపుణ్యాన్ని ప్రామాణికంగా నిర్ణయించింది.
నిబంధనలు, నిఘా:
ప్రమోషన్లకు నిబంధన: సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల స్థాయి వారు ఇకపై ప్రమోషన్లు పొందాలంటే కేవలం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తే సరిపోదు, కంపెనీ అందించే AI టూల్స్‌ను తప్పనిసరిగా వాడాల్సిందేనని యాక్సెంచర్ తేల్చి చెప్పింది.
లాగిన్ వివరాల ట్రాకింగ్: కంపెనీ ఒక అడుగు ముందుకేసి, ఉద్యోగులు వారానికి ఎన్నిసార్లు AI టూల్స్‌లోకి లాగిన్ అవుతున్నారు, ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే వివరాలను నిశితంగా పరిశీలిస్తోంది. దీనిని “రెగ్యులర్ అడాప్షన్” (Regular Adoption) కింద పరిగణిస్తూ హెచ్ఆర్ విభాగం నివేదికలు సిద్ధం చేస్తోంది.
CEO హెచ్చరిక: “AI నేర్చుకోండి లేదా కంపెనీ వదిలి వెళ్ళండి” అని సీఈఓ జూలీ స్వీట్ ఇప్పటికే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
సీనియర్ల నిరసన – ‘బ్రోకెన్ స్లాప్’ విమర్శలు:
మేనేజ్మెంట్ నిర్ణయంపై సీనియర్ స్థాయి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న తమను ఇలా చిన్నపిల్లల్లా ట్రాక్ చేయడం సరికాదని మండిపడుతున్నారు. కంపెనీ ఇస్తున్న కొన్ని AI టూల్స్ నాణ్యత లేని సమాచారాన్ని ఇస్తున్నాయని, అవి కేవలం “చెత్తను సృష్టించే యంత్రాలు” (Broken slop generators) అని కొందరు ఉద్యోగులు అంతర్గత చర్చల్లో విమర్శిస్తున్నారు. ఇటువంటి కఠిన నిబంధనలు కొనసాగితే రాజీనామా చేస్తామని పలువురు సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
భారీగా పెట్టుబడులు – శిక్షణ:
ఈ మార్పుల కోసం యాక్సెంచర్ ఏటా సుమారు 1 బిలియన్ డాలర్లను ఉద్యోగుల శిక్షణ కోసం కేటాయిస్తోంది. ఇప్పటికే 5.5 లక్షల మందికి AIలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసింది. Anthropic వంటి అగ్రగామి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, ‘క్లాడ్’ (Claude) వంటి అత్యాధునిక టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సుమారు 30,000 మంది డెవలపర్లకు ప్రత్యేకంగా ఈ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తోంది.










































































