Power Finance Corporation: పీఎఫ్‌సీలో ఆర్ఈసీ విలీనం.. విధివిధానాల కోసం కేంద్రం కీలక కమిటీలు!

Power Finance Corporation: ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. దేశంలోని ప్రముఖ విద్యుత్ రంగ ఆర్థిక సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), దాని అనుబంధ సంస్థ ఆర్ఈసీ (REC) లిమిటెడ్ విలీనానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
ప్రక్రియ పర్యవేక్షణకు రెండు ప్యానెల్స్:
విలీన విధివిధానాలను అధ్యయనం చేయడానికి కేంద్రం ఒక హై లెవెల్ కమిటీని, రోజువారీ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఒక వర్కింగ్ గ్రూపును నియమించింది. ఈ కమిటీలు ప్రధానంగా, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సమీక్షిస్తాయి. సాంకేతిక, ఆర్థిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. విలీనం తర్వాత సంస్థ నిర్వహణపై స్పష్టమైన ప్రణాళికను రూపొందిస్తాయి.
ఇవి కూడా చదవండి
రూ. 11.5 లక్షల కోట్ల మెగా సంస్థ:
ఈ విలీనం పూర్తయితే, సుమారు రూ. 11.5 లక్షల కోట్ల లోన్ బుక్‌తో దేశంలోనే అతిపెద్ద విద్యుత్ రంగ ఫైనాన్స్ సంస్థ అవతరించనుంది. 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విలీన ప్రతిపాదనను వెల్లడించారు. ఇప్పటికే పీఎఫ్సీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. గతంలో 2019లో ఆర్ఈసీలో 52% వాటాను పీఎఫ్సీ కొనుగోలు చేయడంతో, ప్రస్తుతం ఆర్ఈసీ పీఎఫ్సీకి అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్:
ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఉదయం మార్కెట్లో పీఎఫ్సీ షేర్ ధర రూ. 410 వద్ద, ఆర్ఈసీ షేర్ ధర రూ. 355 వద్ద ట్రేడవుతున్నాయి. విలీనం తర్వాత కూడా ఈ సంస్థ పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ కంపెనీగానే కొనసాగుతుందని, బోర్డు నియమకాల్లో కేంద్రానిదే తుది నిర్ణయమని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి










































































