Hormuz: బాబ్బాబు.. హర్మూజ్ తెరవండి.. ఇరాన్ ను బతిమాలుతున్న ప్రపంచదేశాలు..!
అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా దాడి చేస్తున్నా ఏమాత్రం వెన్నుచూపని ఇరాన్.. హర్మూజ్ విషయంలో తగ్గేదే లేదంటోంది. దీంతో ప్రపంచానికి చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈతరుణంలో ప్రపంచదేశాలు..హర్మూజ్ ఎప్పుడు తెరుస్తారా.. తమ ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాయి. యుద్ధం ప్రారంభమై 22 రోజులు గడుస్తున్న సమయంలో 22 దేశాలు.. ఇరాన్ కు విజ్ఞప్తి చేశాయి.అరబ్ దేశాలపై దాడులను నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూఏఈ, బహ్రెయిన్ సహా 22 దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి.
దాడులు, ప్రతిదాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అరబ్ దేశాల్లోని అమెరికా సదుపాయాలపై వైమానిక, డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో 22 దేశాలు కలిసి ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు వాణిజ్య నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ దేశాలు సంయుక్త ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యూఎస్-యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులు దుస్సాహసంగా అభివర్ణించింది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత వంటివి తమ ప్రయోజనాలకు, తమ మిత్రదేశాలకు ముప్పుగా బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.








