US-IRAN: ఖమేనీ కుటుంబమే టార్గెట్.. ట్రంప్ సైనిక ప్రణాళికలు..!
ఇరాన్ అణ్వాయుధీకరణకు సంబంధించి ఒప్పందం చేసుకోవాల్సిందే అంటోంది అమెరికా. తాముచెప్పినట్లుగా విని తీరాలంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. ఒప్పందానికి రాకుంటే, దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రంప్. అందుకు తగినట్లుగా ఇరాన్ తీరానికి దగ్గరగా తమ యుద్ధవాహకనౌకలను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా… ఇరాన్ సుప్రీం నాయకత్వం సైతం తగ్గేదే లేదంటోంది. తమ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ల దగ్గర పెట్టలేమంటున్న ఖమేనీ. అయితే ఇరాన్ కు సంబంధించి ప్లాన్ బి కూడా ట్రంప్ సిద్ధం చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వెనెజువెలా నాయకత్వాన్ని ఎలా అయితే బంధించి, సమస్య లేకుండా చేసుకున్నారో .. అలానే ఖమేనీ కుటుంబాన్ని సైతం టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఖమేనీ.. అతని వారసుడిగా ప్రచారంలో ఉన్న మొజ్తాబా ఖమేనీలను లక్ష్యంగా చేసుకునేలా సైనిక ప్రణాళికలను అమెరికా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ విషయంలో అన్ని రకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని అమెరికా ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని తొలగించేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ సలహాదారు ఒకరు తెలిపారు. మరోవైపు, ఇరాన్‌పై పరిమిత దాడులు చేసే ఆలోచనలో ఉన్నారా అన్న ప్రశ్నకు తాను దాని గురించి ఆలోచిస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా బదులిచ్చారు. చర్చలకు రావడానికి ఇరాన్‌కు 10-15 రోజులు సమయం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే దాడులు జరిగితే యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ తేల్చి చెప్పారు. అమెరికా దాడులకు పాల్పడితే మధ్యప్రాచ్యంలోని వారి సైనిక స్థావరాలే తమ తదుపరి లక్ష్యాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ ఇప్పటికే తెలియజేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మధ్యప్రాచ్యంలో సైన్యాన్ని మోహరించింది. ఇప్పటికే రెండు అమెరికా విమాన వాహక నౌకలు ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల నుంచి వేలాది మంది సైనికులను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని, ఇది వినాశకర పరిణామాలకు కారణమవుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.







