Joseph Kent: ఇరాన్ పై యుద్ధం ఆపేద్దాం.. ట్రంప్ యంత్రాంగంలోనే అసంతృప్తి..!
ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడు ఒకటి, రెండు రోజుల్లో ముగిసిపోతుందని అందరూ భావించారు. అమెరికన్లు సైతం అదే నమ్మారు. అంతే కాదు.. వెనెజువెలాపై కేవలం గంటల వ్యవధిలో దాడి చేసి, ఏకంగా అధ్యక్షుడు మదురో దంపతులను ఎత్తుకొచ్చిన ట్రంప్ కు.. ఇరాన్ పెద్ద విషయం కాదని భావించారు. అయితే ఇరాన్ మాత్రం..తాము వెనెజువెలా టైపు కాదని యుద్ధరంగంలో బదులిచ్చింది. యుద్ధం మొదలై రోజులు గడుస్తున్నాయి.కానీ.. అమెరికా విజయం సాధించినట్లు కనిపించడం లేదు.
యుద్ధతీవ్రత పెరుగుతున్న కొద్దీ అసలు విషయం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు అర్థమవుతోంది. ఎందుకంటే 40 ఏళ్లుగా ఖమేనీ సామ్రాజ్యంలో అడుగడుగునా.. యుద్ధ పరికరాలు దాచిపెట్టారు. ఎప్పుడైన అవసరమైతే , వాటిని బయటకు తీసి వాడేలా అమరిక చేశారు. ఇప్పుడు అమెరికాయుద్ధం మొదలు పెట్టడంతో.. వారు అదే విధంగా ఆయుధాలు వాడుతున్నారు. అందులోనూ అధునాతన ఆయుధాలు వాడడం.. అమెరికాకు మింగుడు పడడం లేదు.
మరోవైపు యుద్ధం గడువు పెరుగుతున్న కొద్దీ.. అమెరికన్లలో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇన్నాళ్లు అమెరికా పౌరుల్లోఉన్న వ్యతిరేకత కాస్తా.. ఇప్పుడు ఆయన అధికార యంత్రాంగంలోనూ వెలుగుచూసింది.
ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం అధిపతి జోసెఫ్ కెంట్ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసారు. తన పదవికి రాజీనామా చేసారు. అసలు ఈ యుద్ధం ద్వారా అమెరికన్లను ట్రంప్ ఏం చేయదలుచుకున్నారు? అధికారం మీ చేతుల్లో వుంది, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తారా లేదంటే అధోగతి పాల్జేస్తారా అంటూ తన లేఖలో పేర్కొన్నారు.
ఇరాన్ పైన అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియని స్థితిలో వుందనీ, కేవలం ఇజ్రాయెల్ , అమెరికన్ లాబీ ఒత్తిడితోనే అమెరికా … ఇరాన్ పైన యుద్ధం చేస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధాలు అమెరికన్ల ప్రాణాలను హరించడమే కాదు దేశ సంపదను హరించి వేస్తాయనే విషయం ట్రంప్‌కు(trump) తెలియని విషయం కాదని లేఖలో పేర్కొన్నారు.
ఇరాన్ దేశంతో వచ్చే తక్షణ ముప్పు లేదనీ, ఇప్పటికైనా యుద్ధం ముగించుకుంటే మంచిదనీ, లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేసేవారవుతారంటూ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించి అమెరికాను ఓ కొత్త మార్గంలో నడిపిస్తారా లేదంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టేసి మార్గంలో పయనిస్తారా అంతా మీ చేతుల్లోనే వుందంటూ లేఖలో పేర్కొన్నారు జోసెఫ్ కెంట్. ఇరాన్ పైన ఇజ్రాయెల్-యూఎస్ దేశాలు చేస్తున్న సంయుక్త దాడుల నేపధ్యంలో ఓ ఉన్నతాధికారి రాజీనామా చేయడం ట్రంప్ కి పెద్ద కుదుపు లాంటిదే. మరోవైపు మిత్రదేశాలు ఏవీ ట్రంప్ మాటను పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.








