పీఓకేలో హింసాత్మక జ్వాలలు…! పాక్ పై మండిపడుతున్న స్థానికులు..!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మరోసారి రణరంగమైంది. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ)పై పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం విధించడంతో పీఓకే అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రావాలాకోట్ నగరంలో నిరసనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య వందల్లో ఉందని సోషల్ మీడియాలో స్థానికులు పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన కాల్పుల్లో మరణించిన తమ తోటి కార్యకర్త మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చురీ వెలుపల జేఏఏసీ మద్దతుదారులు భారీగా గుమిగూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారామిలిటరీ దళాలు బలప్రయోగం చేయడంతో ఈ హింస చెలరేగింది. పీఓకేలో పోలీసులు మాత్రం.. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు చనిపోయారని… ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఆందోళన కారులు మరణించారని తెలిపారు..
పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో 12 సీట్లను కశ్మీర్ వెలుపల ప్రాంతాలలో నివసిస్తున్న శరణార్థుల కోసం కేటాయించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనితో పాటు గత రెండేళ్లుగా పీఓకేలో విపరీతంగా పెరిగిన పిండి, విద్యుత్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాక్ పాలకుల రాజకీయ వివక్షపై ప్రజలు నిరంతరాయంగా పోరాడుతున్నారు. జులై 27న అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, జేఏఏసీ కేంద్ర కార్యాలయాన్ని సీల్ చేసింది.
‘హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్’ తీవ్ర ఆందోళన
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న పౌర సంస్థపై ఉగ్రవాద చట్టాల కింద నిషేధం విధించడాన్ని తప్పుబట్టింది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్. తక్షణమే ఇరు పక్షాలు చర్చలు జరపాలని కోరింది. మరోవైపు జేఏఏసీ నాయకుడు శౌకత్ నవాజ్ మీర్ ‘ఎక్స్’లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. రావాలాకోట్లో పాక్ ప్రభుత్వం తమ ప్రజలను ఊచకోత కోస్తోందని, నిషేధాలు విధించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పీఓకేలో రోజురోజుకూ క్షీణిస్తున్న ఈ భద్రతా పరిస్థితుల దృష్ట్యా బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు తమ పౌరులకు అత్యవసర ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి.








