US-Iran War: హర్మూజ్ లో మస్కిటో ఫ్లీట్.. అమెరికాకు చుక్కలే..!
మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి. వాటిని అవసరమైతేనే బయటకు తీస్తాం. అవి తీశామంటే శతృవుకు నిద్ర పట్టదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే .. ప్రత్యర్థులను బెదిరిస్తుంటారు. అయితే ట్రంప్ కు నిద్రపట్టనివ్వని విధంగా ఇరాన్ వార్ ప్లాన్ అమలు చేస్తోంది. ఈ యుద్ధంలో తన దగ్గర ఉన్న ఒక్కో ప్రత్యేక ఆయుధాన్ని బయటకు తీస్తోంది. నిన్నటికి నిన్న షాహెద్ డ్రోన్స్ తో హడలెత్తించిన ఇరాన్.. ఇప్పుడు హర్మూజ్ దగ్గర మస్కిటో ఫ్లీట్ మోహరిస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉన్న అమెరికాకు అర్థం కావడం లేదు.
ప్రపంచ చమురు జీవనాడి హర్మూజ్‌పై ఉక్కు పిడికిలి బిగించేందుకు ఇరాన్ ఓ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. అయితే ఇవి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అమెరికా మూడు భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపినా.. అవి హర్మూజ్ వైపు వచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని.. వాటికి తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. అగ్రదేశాల రక్షణ వ్యవస్థలను అలసిపోయేలా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్మూజ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి

మస్కిటో ఫ్లీట్..?
ఇరాన్ చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ . సముద్ర దిగ్బంధ వ్యూహంలో ‘‘మస్కిటో ఫ్లీట్’’గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలకపాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1,500 వరకు ఇరాన్ ఐఆర్జీసీ నేవీ వద్ద ఉన్నాయి. టెహ్రాన్‌కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాకిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను ఆధునిక యాంటీ షిప్ మిసైల్ బోట్లతో సమ్మిళితం చేసి ఇరాన్ వాడుతోంది. ఇటువంటివి 300 వరకు ఉన్నట్లు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజి సూపర్ సోనిక్ గైడెడ్ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితోపాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఘదెర్, జాఫర్, అబు మహదీ వంటి క్షిపణులున్నాయి. ఇక ఈ చిన్న బోట్లు స్మార్ట్మైన్స్ను పర్చడం వంటివి కూడా చేయగలవు.
ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణించగలవు. సముద్రంపై చురుగ్గా కదలగలవు. గుంపుగా ఈ చిన్నబోట్లు దాడి చేస్తే.. భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం ఐఆర్జీసీ యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు హర్మూజ్‌లో పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు చిక్కే అవకాశాలు ఎక్కువ.
ఇవి కూడా చదవండి








